ఏపీలో రీ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

అమరావతి : ఏపీలో ఐదు స్థానాల్లో రేపు జరిగే రీపోలింగ్ కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈవిఎం లు మోరాయించిన వెంటనే తగిన చర్యలు తీసుకొనేందుకు బెల్ ఇంజనీర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ..గత అనుభవాల దృష్ట్యా అధికారులు,భద్రతను కూడా భారీగానే పెంచింది ఈసీ..అన్ని బూత్ ల వద్ద పూర్తిగా వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ జరగనుంది..ఈవీఎం ల ఇబ్బందులు తలెత్తితే అదనపు ఈవీఎంలను అందుబాటులో ఉంచింది ఎన్నికల కమిషన్..సుమారు ఐదు వేల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
2019, ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నిలకు సంబంధించి రాష్ట్రంలో ఐదు చోట్ల రీపోలింగ్ జరపాలన్న ఏపి సీఇవో గోపాలకృష్ణ ద్వివేది సిఫార్సు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రిన్ సిగ్నల్ ఇచ్చింది. వేర్వేరు కారణాలతో జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్ స్టేషన్ల వద్ద రేపు రీపోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరగుతుంది. గుంటూరు,నెల్లూరు జిల్లాల్లో రెండు చోట్ల,ప్రకాశం జిల్లాలో ఒకచోట మళ్లీ పోలింగ్ జరుగుతుంది. గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ,పార్లమెంట్ లకు సంబంధించి 94 వ పోలింగ్ బూత్ లో, గుంటూరు వెస్ట్ అసెంబ్లీ పరిధిలో 244 పోలింగ్ స్టేషన్లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ కు పోలింగ్ జరగనుంది. ఇక ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లోని 247 పోలింగ్ స్టేషను పరిధిలో అసెంబ్లీ, పార్లమెంటుకు రీ-పోలింగ్ జరగనుంది. నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ పరిధిలోని ఇస్కపాలెం 41 వ నెంబర్ పోలింగ్ బూత్ లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు రీపోలింగ్ జరగనుంది. సూళ్ళూరు పేట అసెంబ్లీ సెగ్మెంటుకు చెందిన అటకానితిప్పలోని 197 వ పోలింగ్ స్టేషన్ లో కేవలం పార్లమెంటు స్థానానికి సంబంధించి రీ-పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా అదనపు ఈవీఎం లు, వీవీ పాట్ లు పోలింగ్ కేంద్రాలవద్ద సిద్ధంగా ఉంచినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది తెలిపారు. ఈవీఎంలు మొరాయిస్తే సమస్య తలెత్తకుండా ప్రతీ రీపోల్ కేంద్రం వద్ద బెల్ కంపెనీ ఇంజినీర్లను అందుబాటులో ఉంచుతున్నారు..సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పోలింగ్ సరళిని లైవ్ ద్వారా పర్యవేక్షిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు.
రీ పోలింగ్ ప్రక్రియను అత్యంత ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని ద్వివేది తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో షామియానాలు, త్రాగునీరు సౌకర్యాల ఏర్పాట్లను పూర్తి చేశామని, బందోబస్తుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. రీ-పోలింగ్ జరిగే ఐదు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఐదుగురు ప్రత్యేక పరిశీలకులను నియమించామన్నారు. కేశానుపల్లి బూత్ లో 956 మంది,నల్లచెరువు బూత్ లో 1,376మంది, కలనూతల లో 1,070 మంది,ఇసుకపాలెం లో 1,084 మంది ఓటర్లు, అటకానితిప్ప బూత్ లో 578 మంది ఓటర్లు కలిపి మొత్తం 5,064 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 1200 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.
ఇప్పటికే ఓటర్లకు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయింది..ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలలోపు క్యూ లైన్లలో నిలబడిన ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఉదయం 5 గంటలా 30 నిమిషాలకు అన్ని పార్టీల ఏజెంట్లను పోలింగ్ కేంద్రాలకు రావలసిందిగా ఎన్నికల కమీషన్ విజ్ఞప్తి చేసింది. 5 గంటలా 45 నిమిషాలకు మాక్ పోలింగ్ నిర్వహించేందుకు సహకరించాలని ఏజెంట్లను కోరింది. ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలకు పాల్పడినా, సిబ్బంది నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని సిఇవో ద్వివేది హెచ్చరించారు.