మళ్లీ కుదురుతున్న పొత్తు.. టీడీపీ, జనసేన కలుస్తున్నాయా?: టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పొత్తులు, ఎత్తులు విషయంలో టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలో దిగవచ్చునంటూ మాజీ మంత్రి , టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు జోస్యం చెప్పారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని, జమిలి ఎన్నికల గురించి ప్రధాని మోడీ కూడా సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగా రానున్న క్రమంలో రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు జరుగుతాయని అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చారు. బీజేపీ, జనసేన పార్టీలతో టీడీపీ దోస్తీ కొనసాగుతోందంటూ కొంతకాలంగా వైసీపీ ఆరోపిస్తుండగా.. అయ్యన్నపాత్రుడి మాటలు ఆ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో తెరవెనుక ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ.. బీజేపీ కలిసి పోటీ చేసాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారికి మద్దతుగా నిలిచారు. అయితే అప్పుడు జనసేన పోటీలో లేదు. కానీ గత ఎన్నికల్లో మాత్రం జనసేన పోటీ చేసింది. ఇవాళ(02 సెప్టెంబర్ 2019) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కూడా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వీరి మధ్య దోస్తీ కుదిరిందనే వాదనను వైసీపీ వినిపిస్తుంది.