నారాయణ.. నారాయణ : తిరుమల గీతామృత లహరిలో.. ఏసుక్రీస్తు కీర్తనలు

  • Published By: vamsi ,Published On : September 24, 2019 / 09:02 AM IST
నారాయణ.. నారాయణ : తిరుమల గీతామృత లహరిలో.. ఏసుక్రీస్తు కీర్తనలు

Updated On : September 24, 2019 / 9:02 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లో టీటీడీ ఆర్థిక సహకారంతో ప్రచురితమైన ‘భక్తి గీతామృత లహరి’ పుస్తకంలో క్రైస్తవ మతానికి సంబంధించిన గేయాలు ఉండడం కలకలం రేపుతుంది. భక్తిగీతామృత లహరి అనే హైందవ పుస్తకంలో అన్యమత ప్రస్తావన ఉండడంపై హిందూవాదులు సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రోజుకొకటి చొప్పున ఇటువంటి ఘటనలు బయటపడుతుండడంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమై పుస్తకాన్ని టీటీడీ అధికారులు తొలగించారు.

రచయిత రాసే పుస్తకం పూర్తిగా హైందవ వ్యవస్థకు సంబంధించి ఉండాలనేది టీటీడీ నిబంధన అయితే.. ఇటువంటి ఘటన చోటుచేసుకోవడంపై విచారణకు ఆదేశించారు టీటీడీ అధికారులు. చెన్నైకి చెందిన సీతారామయ్య అనే రచయిత భక్తిగీతామృత లహరిని రచించారు. ఈ పుస్తకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ పుస్తకంలో అన్యమత ప్రస్తావన ఉన్నట్లుగా లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. ఇందులో 182, 183, 184 పేజీలలో ఏసు క్రీస్తుకు సంబంధించిన ప్రస్తావన ఉంది.

ఈ పుస్తకాన్ని ప్రైవేట్‌ వ్యక్తులు ముద్రించారని, పుస్తక ముద్రణకు టీటీడీ ఆర్థిక సహాయం మాత్రమే చేస్తుందని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. అన్యమత సమాచారంపై విచారణ జరుగుతుందని వెల్లడించారు. రచయితలకు ఆర్థికసాయం అందజేసి పుస్తక రచన చేసేలా 1979లో టీటీడీ ఒక పథకం ప్రారంభించిందని, శ్రీవారి వైభవం, హిందూ ధర్మ ప్రచారం మాత్రమే చేసేలా పుస్తకాలు ఉండాలనే మార్గదర్శకాలు అందులో ఉన్నాయని, అయితే ఇటువంటి పొరపాటు ఎక్కడ జరిగిందనే విషయంపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. తప్పిదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఈవో అన్నారు.

అయితే ఈఓ స్పందించడంతో వివాదం ముగిసినట్లే అని అందరూ భావించారు. కానీ ఆర్షజ్యోతి అనే పుస్తకంలోనూ అన్యమత ప్రస్తావన ఉన్నట్లు గుర్తించారు అధికారులు. జయశ్రీ రచించిన పుస్తకంలో బైబిలు గురించే కాదు ఖురాన్ గురించి కూడా ప్రస్తావన ఉన్నట్లు తేలింది. మతాల ప్రస్తావన ఉన్నచోటే ఆధ్మాతికత మొదలవుతుందని పేర్కొంటూ బైబిలు ఖురాన్ వ్యాఖ్యలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.