నాపై ఉన్న కేసు ఒక్కటే.. పోరాటం కేసిఆర్‌తోనే!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. తిరుపతి రోడ్ షోలో మాట్లాడిన చంద్రబాబు జగన్ కేసులే టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సమర్పించిన అఫిడవిట్‌లో 40 పేజీలు జగన్ నేరచరిత్ర గురించి ఉందని, 31 కేసులు ఉన్న జగన్ ఆర్ధిక నేరాలు చేశారని దుయ్యబట్టారు.
Read Also : పవన్‌కు పృథ్వీ వార్నింగ్: పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు
తనపై ఇప్పటివరకు ఒక్క కేసు మాత్రమే ఉందని, ఆ కేసు కూడా ప్రజల కోసం పోరాడినందుకు పెట్టారని అన్నారు. బాబ్లీ ప్రాజక్ట్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఎత్తు పెంచుతుందని ధర్నా చేసి అడ్డుకున్నందుకు తనపై కేసు ఉందని వెల్లడించారు. అదీ తనకు, జగన్ కు ఉన్న తేడా అంటూ ప్రజలకు తెలిపారు.
అలాగే ఇంట్లో మనిషిని చంపుకునే వ్యక్తులకు సహకరిస్తారా? అంటూ ప్రశ్నించారు. వైఎస్ వివేకా చనిపోతే గుండెపోటుగా చిత్రీకరించి, సాక్ష్యాలను చెరిపివేయడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను నమ్ముకుంటే జైలేగతి అని, రాష్ట్రానికి అతిపెద్ద సమస్యలా జగన్ తయారయ్యాడంటూ విమర్శించారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రచారం చేసినా, పోరాటం మాత్రం తనకు, కేసీఆర్‌కు మాత్రమేనని, దొడ్డిదారిన రాష్ట్రంపై పెత్తనం చేయాలని కేసీఆర్ చూస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
Read Also : నోరు అదుపులో: ఎన్నికల ప్రచారంలో ఈ పదాలు వాడొద్దు