అమరావతిలో పూజలు చేసి బయలుదేరిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచార శంఖారావం ప్రారంభించారు. అమరావతిలో ఇంట దగ్గర ప్రత్యేక పూజలు చేసి.. పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి తిరుపతి బయలుదేరి వెళ్లారు. ఎన్నికల్లో 150+ సీట్లే లక్ష్యంగా ప్రచారం మొదలు పెట్టేందుకు సిద్దమయ్యారు. 2019, మార్చి 16న తిరుపతి నుంచి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజ నిర్వహించిన చంద్రబాబు తిరుపతికి బయల్దేరారు. పూజ సమయంలో చంద్రబాబుతో పాటు భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్ ఉన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
Read Also : కోమటిరెడ్డికి కాంగ్రెస్ హ్యండ్.. కారణం ఇదేనా?
‘మీ భవిష్యత్తు.. నా బాధ్యత’ నినాదంతో చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తిరుపతిలోని తారకరామ మైదానంలో చిత్తూరు జిల్లా బూత్ కన్వీనర్లు, సేవామిత్రల సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం శ్రీకాకుళం చేరుకుని కోడి రామ్మూర్తి స్టేడియంలో జిల్లా బూత్ కన్వీనర్లు, సేవామిత్రల సమావేశంలో పాల్గొంటారు.
మార్చి 17వ తేదీ చంద్రబాబు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. 17న విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. 18న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 19న రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ఆయా జిల్లాల్లోని సభలల్లో బూత్ కన్వీనర్లు, సేవామిత్రలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొంటారు. జిల్లాల్లో సభలు ముగిశాక చంద్రబాబు బస్సుయాత్ర చేపట్టి జనాలలోకి వెళ్తారు. దీనికి టీడీపీ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది.