మోడీకి లేఖాస్త్రం : మరోసారి బ్లాక్ డ్రెస్‌లో బాబు

ప్రధాని మోడీ విశాఖకు రానున్న నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 28వ తేదీ గురువారం ఘాటు లేఖ రాశారు. విభజన హామీలన్నీ నెరవేర్చాకే రాష్ట్రంలో అడుగుపెట్టాలని సూచించారు. విభజన తర్వాత ఆస్తులు, అప్పుల పంపిణీలో ఏపీకి అన్యాయం చేశారని పేర్కొన్నారు.
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్
ఐదేళ్లయినా విభజన గాయాలు ఇంకా మానలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పుండుపై కారం చల్లేలా ప్రధాని పర్యటనలు, వ్యాఖ్యలు ఉన్నాయని సీఎం మండిపడ్డారు. రిక్త హస్తాలతో ఆంధ్రప్రదేశ్‌కు రావడం తలవంపులుగా లేదా? అని ప్రశ్నించారు. ప్రధాని పదవిలో ఉన్న మోడీ అన్ని అంశాలకూ వివరణ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
విశాఖ పర్యటనకు ఒకరోజు ముందు రైల్వే జోన్ ప్రకటన చేయడాన్ని చంద్రబాబు ఆక్షేపించారు. వాల్తేర్ డివిజన్‌ను విడదీసి ఏపీ పట్ల మోడీ తన అక్కసును మరోసారి వెళ్లగక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 6,500 కోట్ల మేర నష్టం వాటిల్లేలా జోన్ ప్రకటన చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. స్థానిక డివిజన్ లేకుండా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లేకుండా జోన్ ఏర్పాటు దేశ చరిత్రలోనే లేదన్నారు.
Read Also : ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలట : పాక్ డిమాండ్
ఉత్తరాంధ్ర ప్రజలను మోడీ మరోసారి మోసం చేశారని లేఖలో విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ బకాయిలు, హుద్ హుద్ తుపాను సాయంగా ప్రకటించిన వెయ్యి కోట్లలో 360కోట్ల బకాయిలు, రెవెన్యూ లోటు సహా 17అంశాలపై చంద్రబాబు ప్రశ్నలు సంధించారు.
మరోవైపు విశాఖకు మోడీ రాకను నిరసిస్తూ.. సీఎం చంద్రబాబు నల్లచొక్కా ధరించనున్నారు. మొన్నటి గుంటూరు సభ మాదిరిగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపాలని పిలుపునిచ్చారు. మోడీ రాష్ట్రంలో అడుగు పెట్టే ప్రతీ రోజూ తమకు బ్లాక్ డే అన్న చంద్రబాబు.. తాను నల్లచొక్కా ధరించి నిరసన తెలుపుతానన్నారు. విభజన హామీలను అమలు చేయమంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని.. శాంతియుత నిరసనలతో హక్కులను సాధించుకుంటామన్నారు.
Read Also : మనుషులు బతకాలంటే…ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే