దేశంలో దొంగలు ఏకమయ్యారు.. మనల్ని ఇళ్లలో ఉండనివ్వరు

దేశంలో దొంగలు ఏకమై రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఒక వైపు మోదీ, మరోవైపు కేసీఆర్, ఇంకోవైపు జగన్.. ముగ్గురు దుష్టులూ రాష్ట్రంపై ముప్పేట దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీపై చేస్తున్న కుట్రలపై పోరాటాలకు అందరూ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు టీడీపీ నేతలకు సూచనలు చేశారు. తమపై ఎన్ని రకాల దాడులు చేయాలో అన్నీ చేస్తున్నారని, న్యాయస్థానం కొట్టేసిన వల్లభనేని వంశీ పాత కేసును కూడా తిరగదోడి.. నాన్ బెయిల్ వారెంట్ జారీ చేయించారని మండిపడ్డారు.
అలాగే మైలవరంలో జగన్ ప్రసంగంతో రెచ్చిపోయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు పోలీసులపైన కూడా దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ఓటమి భయంతో వైసీపీ అరాచకాలకూ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అరాచకాలు చేసినప్పటికీ ప్రజల అండ మనకు శ్రీరామరక్ష అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం నేతల మనో నిబ్బరాన్ని దెబ్బతీసే కుట్రలకు ధీటుగా బదులివ్వాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మైలవరంలో పోలీసులు, జవాన్లపైన చెప్పులు, రాళ్లతో దాడులు చేయడం హేయం అని చంద్రబాబు చెప్పారు. అలాగే పొన్నూరులో స్కూలు పిల్లల ఆటోపై దౌర్జన్యం.. అద్దెకుండే వాళ్లపై దౌర్జన్యాలు, అర్ధరాత్రి ఇళ్లు ఖాళీ చేయించడం, గర్భిణి జుట్టు పట్టుకుని ఈడ్చటం, వృద్ధులనే కనికరం లేకుండా అర్ధరాత్రి సామాన్లు బయట పారేయడం.. చేయవలసిన చెత్త పనులు అన్నీ వైసీపీ చేస్తుందని చంద్రబాబు మండిప్డారు. వైసీపీకి ఓటేస్తే మన ఇంట్లో మనం అద్దెకు ఉండాల్సిందేనని ఎద్దేవా చేశారు.