చింతమడకలో KCR..బంజారాహిల్స్‌లో KTR ఓటు

  • Published By: madhu ,Published On : April 11, 2019 / 01:33 AM IST
చింతమడకలో KCR..బంజారాహిల్స్‌లో KTR ఓటు

Updated On : April 11, 2019 / 1:33 AM IST

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అంతకంటే ముందే మాక్ పోలింగ్‌ను ఎన్నికల అధికారులు నిర్వహించారు. ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఓటు వేయడానికి సిద్ధిపేటకు రానున్నారు. 

సిద్ధిపేట నియోజకవర్గంలోని చింతమడకలో కేసీఆర్‌ దంపతులకు ఓటు ఉంది. దీనితో ఓటు వేయడానికి ఏప్రిల్ 11వ తేదీన హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆ గ్రామానికి చేరుకుంటారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు. 2018 డిసెంబర్ 7న జరిగిన శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, సతీమణి శోభ ఓట్లు వేశారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన అనంతరం ఆయన తొలిసారిగా చింతమడక గ్రామానికి వస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇక తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సోమాజీగూడ ఎంఎస్ మక్తాలోని అంగన్ వాడీ కేంద్రం బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంజారాహిల్స్ నందినగర్‌లో GHMC కమ్యూనిటీ హాల్‌లో ఓఠు హక్కు వినియోగించుకుంటారు. ఈ పోలింగ్ కేంద్రం సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఖైరతాబాద్ శాసనసభా స్థానంలోనిది.