ఆసుపత్రి బిల్లు చెల్లించని బీమా కంపెనీకి భారీ జరిమానా

ఆసుపత్రి బిల్లులు చెల్లించడంలో ఆలస్యం చేసిన బీమా కంపెనీకి భారీ జరిమానా విధించింది వినియోగదారుల హక్కుల ఫోరం. పాలసీ నిబంధనల ప్రకారం రూ. 2 లక్షల బిల్లు చెల్లించడంతోపాటు.. అతడిని మానసిక వేదనకు గురిచేసినందుకు గానూ మరో రూ. లక్ష చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాయదుర్గం ప్రాంతానికి చెందిన అమిత్రా సుధాన్ కార్ 2014లో కుటుంబసభ్యుల పేరిట ఆరోగ్య బీమా చేయించుకున్నారు. అయితే ఉబ్బసం సమస్యతో సుధాన్ కార్ తల్లి 2015లో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రి బిల్లు రూ. 5.5 లక్షలు అయింది. అయితే పాలసీ ప్రకారం బీమా కంపెనీ రూ. 2 లక్షలు చెల్లించాలి. దీంతో బిల్లు విడుదల చేయాలంటూ సుధాన్ కార్ బీమా కంపెనీని కోరగా.. సదరు కంపెనీ రీయింబర్స్‌మెంట్ మాత్రం చేయలేదు.
దీంతో కంపెనీ వెబ్‌సైట్‌లో పరిశీలించిన సదరు వినియోగదారుడికి క్లెయిమ్‌ను బీమా కంపెనీ నిరాకరించినట్లు తెలిసింది. దీంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు సదరు క్లయిమ్ దారుడు. ఇరువర్గాల వాదనలు విన్న ఫోరం.. అన్నీ పత్రాలు సమర్పించిన బిల్లు విడుదల చేయకపోవడాన్ని సేవాలోపంగా గుర్తించి కంపెనీకి జరిమానా విధించింది. ఆసుపత్రి బిల్లు రూ. 2లక్షలు.. మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ. లక్ష చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.