బాబు మరోసారి సీఎం కావాలి…టీడీపీ సభలో కేజ్రీవాల్

ఏపీలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా చాలా ముఖ్యమైనవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.విశాఖలో ఆదివారం(మార్చి-31,2019)టీడీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..చంద్రబాబు ఏపీని మోడ్రన్ రాష్ట్రంగా మార్చారని, ఆయన మరోసారి సీఎం కావాలని అన్నారు. టీడీపీ భారీ బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు, బంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ…ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు కలిసి దేశంలో అనేక సమస్యల్ని సృష్టించారన్నారు.ప్రశాంతంగా ఉండే దేశంలో కులమతాల పేరుతో విద్వేషం నింపారన్నారు. దేశం మొత్తాన్ని వారిద్దరూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. వారి దెబ్బకు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.వారిద్దరూ కలిసి ప్రజాస్వామ్యాన్నిఖూనీ చేశారన్నారు.
మోడీ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిందన్నారు.నోట్ల రద్దు దెబ్బకు అన్ని రకాల వ్యాపారాలూ కుదేలయ్యాయని తెలిపారు. నోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణమని ఇప్పుడు తెలుస్తోందన్నారు.మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే హిట్లర్ పాలన వస్తుందన్నారు. మోడీ మరోసారి ప్రధాని అయితే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని బీజేపీ నేతలే చెబుతున్నారని అన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు.