దాహమో రామచంద్రా : కొత్తగూడెంలో తాగునీటి కష్టాలు

  • Published By: madhu ,Published On : April 21, 2019 / 02:35 PM IST
దాహమో రామచంద్రా : కొత్తగూడెంలో తాగునీటి కష్టాలు

Updated On : April 21, 2019 / 2:35 PM IST

సుమారు 90 వేల జనాభా ఉన్న కొత్తగూడెం పట్టణంలో తాగునీటి కష్టాలు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్నాయి. సరైన నీటి సరఫరా లేక త్రాగేందుకు గుక్కెడు నీరు లేక విలవిల్లాడుతున్నారు. కొత్తగూడెం పట్టణానికి ఎన్నో సంవత్సరాల కిందట తాగునీటి కోసం కిన్నెరసాని నుంచి పైప్ లైన్ల సహాయంతో మంచినీటి సరఫరా ఏర్పాటు చేశారు. రోజు రోజుకి జనాభా పెరగడంతో  పాటు.. కిన్నెరసాని పైప్ లైన్ల మరమ్మత్తులతో నీటి సరఫరా అడుగంటడంతో మంచినీటి కొరత వేధిస్తోంది. 

ఇప్పటివరకూ మున్సిపాలిటీ అధికారిక లెక్కల ప్రకారం పట్టణ పరిధిలో 22 వేల 130 ఇళ్లు ఉండగా మంచినీటి సరఫరా మాత్రం కేవలం అధికారికంగా 8 వేల 800 ఇళ్లకు అనధికారికంగా మరో 3 వేల ఇళ్లకు మాత్రమే ఉండడంతో సమస్య తీవ్రతరమవుతోంది. అసలే అరకొర నీటి సరఫరాతో తాగునీటి కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టణ వాసులకు వేసవి కాలం రావడంతో నీటి కష్టాలు మరింతగా పెరిగాయి. సింగరేణి బొగ్గు గనులు నెలవై ఉన్న ప్రాంతం కావడం వల్ల వేసవిలో అనధికారికంగా 50 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

కిన్నెరసానిలో సరిపడా నీరు లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన మిషన్ భగీరథ పనులు పూర్తి కాకపోవడం, మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ పద్ధతులతో నీటి సరఫరా చేయకపోవడం తదితర సమస్యలతో పట్టణ ప్రజల గొంతు ఎండిపోతోంది. దీంతో తాగునీటి కోసం మినరల్ వాటర్‌ను ఆశ్రయించడంతో.. వ్యాపారులు అడ్డంగా దోచేస్తున్నారు. చివరకు ఈ నీటి తగాదాలు పోలీస్‌స్టేషన్ల వరకు చేరుతున్నాయని అంటున్నారు. ఇప్పుడే ఇంత నీటి కొరత ఉంటే ముందు ముందు ఈ సమస్య మరింత ముదిరే పరిస్థితి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.