విశాఖలో తాగు నీటి కష్టాలు

  • Published By: veegamteam ,Published On : April 24, 2019 / 03:16 PM IST
విశాఖలో తాగు నీటి కష్టాలు

Updated On : April 24, 2019 / 3:16 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకి భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. పెరుగుతోన్న జనాభాతో పాటు నీటి అవసరం కూడా పెరగడంతో నీటి జాడ ప్రశ్నార్ధకమవుతుంది. కనీస అవసరాలు మాట దేవుడెరుగు తాగడానికి గుక్కెడు నీళ్ల కోసం విలవిల్లాడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మంచినీటి కోసం ధర్నాలు చేస్తూ రోడ్డెక్కే పరిస్థితులు ఎదురవుతున్నాయి. నీళ్లకోసం జనాలు పడరాని పాట్లు పడుతున్నారు.

విశాఖలో తాగునీటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. మహా నగరం నీటి చుక్క దొరక్క విలవిలలాడుతోంది. మాకవరపాలెం మండలం రాచపల్లి వద్ద ఏలేరు కాలువకు పడిన గండి నగరంపై తీవ్ర ప్రభావం చూపింది. నాలుగు రోజులుగా విశాఖ ప్రజలు తాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే వేసవి ఆపై అనేక ప్రాంతాల్లో బోర్లు అడుగంటిపోయాయి. దీంతో ఎప్పుడు వస్తాయో.. ఎంతసేపు వస్తాయో తెలీని వీది కుళాయిలపైనే ఆధారపడుతూ నానా తంటాలు పడుతున్నారు.  

నీటి కష్టాలు నగర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో సరిపడా నీరు రాక ట్యాంకర్లను తెప్పించుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ఏప్రిల్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే మే నాటికి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. నీరందని శివారు ప్రాంతాల్లో పరిస్థితి దయనీయం. తాగునీరుంటే, వాడుకకు ఉండకపోవడం వల్ల బయటి నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాలలో  కనీస అవసరాలకు కూడా నోచుకోక పడరాని పాట్లు  పడుతున్నారు. 

ఇంతవరకూ మంచినీటి సమస్య అంటే తెలీని శివారు ప్రాంతాలు ఈ ఏడాది చుక్క నీటి కోసం కుస్తీలు పడే పరిస్థితి వచ్చింది. కొన్నిచోట్ల సన్నటి ధారతో ఒకటి రెండు బిందెలు మాత్రమే నిండుతున్నాయని మహిళలు వాపోతున్నారు. పోనీ  మోటార్ల నుంచి వస్తుందనుకుంటే అక్కడా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చుక్క నీరు కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటు జీవీఎంసీ చేతులెత్తేయడంతో విశాఖవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో  అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతూ…వీలైనంత వరకు కుళాయిల ద్వారా తాగునీరు ఇవ్వలేని ప్రాంతాలకు ట్యాంకర్లను పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఏలేరు రిజర్వాయర్‌ వద్ద పంపింగ్‌, ఇక్కడ ఫిల్టరింగ్‌కు సమయం తీసుకోవడంతో అన్ని ప్రాంతాలకు  నీటిని సరఫరా చేయలేకపోవడంతో జనాలు రోడ్డెక్కి వాటర్ కోసం ధర్నాలు చేస్తున్నారు.

మధురవాడ, సీతమ్మధార, నక్కవానిపాలెం ఏరియాలకు ఒక నిర్దిష్ట సమయం అంటూ లేకుండా ఇష్టారాజ్యంగా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు.  దీంతో  అన్ని పనులు మానుకుని నీళ్ల కోసమే ఎదురుచూడటానికి సరిపోతుందని మహిళలు  వాపోతున్నారు.  కంచరపాలెం, తాటిచెట్లపాలెం, శ్రీనివాసనగర్‌లకు గత నాలుగు రోజులుగా తాగునీరు అందడం లేదు. ఇక్కడి ప్రజలంతా కిరాణా దుకాణాల్లో ధర ఎక్కువైన వాటర్‌ క్యాన్లు కొనుక్కుంటున్నారు. అయినా వాటర్ సమస్య తీరండం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

వీధుల్లో చేతిపంపులు కూడా పాడైపోవడంతో నీటికోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి సిటీలో కనిపిస్తుంది. దీంతో చాలామంది మినరల్ వాటర్ బాటిల్స్‌మీదే ఆధారడపడుతున్నారు. ఇదే అదునుగా మినరల్ వాటర్ బాటిల్ సప్లయిర్స్‌ అమాంతం ధరను పెంచేసి అందినకాడికి దోచేసుకుంటున్నారు. మొన్నటి వరకూ 20,30 రూపాయల ఉండే ధర ఇపుడు 70 రూపాయలకు చేరింది. పోనీ అంతధర పెట్టి కొందామన్నా అవి కూడా ఎపుడు దొరుకుతాయో తెలీని స్థితి విశాఖలో నెలకొంది. 

ఏలేరు కాలువ గండి కారణంగా  జీవీఎంసీ పరిధిలోని 80 శాతం వరకు మంచినీటి సరఫరా బంద్‌ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువ గండిని పూడ్చి వేసినా  ఏలేశ్వరం నుంచి నీటి ప్రవాహం నగరానికి చేరుకోవాలంటే సుదీర్ఘ సమయం పడుతుంది. దీంతో ఈ వేసవికి విశాఖ వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవు.