బంగారమైపోయింది : డబ్బా ఇసుక ధర రూ.10

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 07:01 AM IST
బంగారమైపోయింది : డబ్బా ఇసుక ధర రూ.10

Updated On : October 29, 2019 / 7:01 AM IST

అవును… ఇసుక బంగారమైంది. ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అందుకే డబ్బా ఇసుకను రూ.10 చొప్పున విక్రయించారు. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరంలో ఈ విచిత్రం జరిగింది. దీనికి కారణం లేకపోలేదు. సోమవారం(అక్టోబర్ 28,2019) దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే కేదారేశ్వర వ్రతానికి కొత్త ఇసుక అవసరం. 

గద్దెల నిర్మాణంతోపాటు ఇతర అవసరాలకు ఇసుక వినియోగిస్తారు. గోదావరిలో స్నానం చేసి నదిలో కాస్త ఇసుకను భక్తులు ఏటా తీసుకెళ్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మంథని దగ్గర గోదావరి నిండుగా ఉండి ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. 

దీంతో.. ఇదే అదనుగా గోదావరి అవతలి వైపు మంచిర్యాల జిల్లా శివ్వారం నుంచి కొంతమంది సంచుల్లో ఇసుకను తీసుకొచ్చారు. స్నాన ఘాట్ల దగ్గర విక్రయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో భక్తులు కొనుక్కుని వెళ్లారు. గతంలో ఇసుకన పట్టించుకునే వారు కాదు. నీళ్లు లేకపోవడంతో భక్తులు ఉచితంగానే ఇసుకను తమ వెంట పట్టుకెళ్లేవారు.

అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఇసుక దొరకని పరిస్థితి ఉంది. దీంతో భక్తులు కూడా కాంప్రమైజ్ అయ్యారు. డబ్బులిచ్చి మరీ ఇసుక కొన్నారు. డబ్బా పది రూపాయలు అని చెప్పడంతో ముందు షాక్ తిన్నా.. ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో కొనుకున్నామని చెప్పారు.