వణుకు పుట్టించాయి : రాళ్ల వాన విధ్వంసం

వడగళ్లు, పిడుగులు, ఈదురుగాలులు.. తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిశాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల జల్లులు పడ్డాయి. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో భారీ చెట్లు సైతం నేలకొరిగాయి. వర్షాల కారణంగా చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులు భయపెడితే వడగండ్లు వణికించాయి. రాళ్ల సైజులో ఉన్న వడగండ్లను చూసి జనాలు బెంబేలెత్తిపోయారు. ఇది నీటి వర్షమా? రాళ్ల వర్షమా? తెలియక కంగారు పడ్డారు. రాళ్ల సైజులో ఉన్న వడగండ్లు చూసి షాక్ తిన్నారు. కనివిని ఎరుగని రీతిలో రాళ్ల వర్షం కురిసింది. ఎవరూ ఊహించని విధంగా పెద్ద పెద్ద రాళ్లు పడ్డాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావు పల్లి గ్రామంలో భయంకరమైన రాళ్ల వాన బీభ్సతం సృష్టించింది.
సిద్దిపేట జిల్లాలో భారీ సైజులో వడగండ్లు పడ్డాయి. కోహెడ మండలంలో 5వ రోజూ వడగండ్ల వాన కురిసింది. పెనుగాలులతో కూడిన రాళ్ల వర్షం పడింది. వరి, మక్కజొన్న, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. కోహెడ మండలంలోని బస్వాపూర్, తంగళ్లపల్లి, గుండారెడ్డిపల్లి, కూరెల్ల తదితర గ్రామాల్లో భారీగా వడగండ్లు కురిశాయి. పలుగ్రామాల్లో సుమారు గంటపాటు వర్షం కురిసింది. పలుచోట్ల ఆరబోసిన వరిధాన్యం తడిసింది. కొన్నిచోట్ల రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వరంగల్ రూరల్ జిల్లాలోని పలుచోట్ల గాలివాన రైతాంగాన్ని అతలాకుతలం చేసింది. నర్సంపేట, నెక్కొండ, ఖానాపురం, వర్ధన్నపేట మండలాల్లోని పలు గ్రామాల్లో గాలిదూరం బీభత్సం సృష్టించింది. మామిడి తోటలో కాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంట పూర్తిగా నేలకొరిగింది. ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి.
క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతోనే అకాల వర్షాలు, వడగండ్లు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అకాల వర్షాలు, వడగండ్లు, ఈదురుగాలులు విజృంభిస్తాయని చెప్పారు. మరో 15 రోజుల పాటు వీటి ప్రభావం ఉంటుందన్నారు.