హుజూర్ నగర్ ఎవరిదో : పోలింగ్ ప్రారంభం

తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ రేపుతున్న హుజూర్ నగర్ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర.. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈవీఎంకు అనుసంధానం చేసే బ్యాలెట్ యూనిట్‌తో గరిష్టంగా 15 మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉండడంతో ఇక్కడ రెండు ఈవీఎం యూనిట్లను వినియోగించనున్నారు. ఉపఎన్నికకు.. 967 బ్యాలెట్ యూనిట్లు, 363 కంట్రోల్ యూనిట్‌లు, 378 వీవీప్యాట్‌లు సిద్ధం చేశారు. ఇప్పటికే వీటిని 2 సార్లు పరిశీలించి.. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని నిర్ధారించుకున్నారు.
ఎన్నికల ఫలితాలను మహిళలే నిర్దేశించనున్నారు. లక్షా 16వేల,508 మంది పురుషులు, లక్షా 20వేల,435 మంది మహిళలు కలిపి మొత్తం 2లక్షల 36వేల 943 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు. పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 21వ తేదీ సోమవారం నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. పోలింగ్‌లో ఎలాంటి లోపాలకు తావివ్వకుండా.. ఏర్పాట్లు చేసినట్లు సూర్యాపేట కలెక్టర్ అమేయ్ కుమార్ తెలిపారు. ప్రతి జోన్‌లో అదనపు ఈవీఎంలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఫ్రీ అండ్ ఫెయిర్‌గా.. ఎన్నిక నిర్వహించడమే తమ లక్ష్యమన్నారు కలెక్టర్ అమేయ్ కుమార్.
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభకు ఎంపిక కావడంతో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా పద్మావతిరెడ్డి, బీజేపీ నుంచి కోటా రామారావు, టీడీపీ అభ్యర్ధి చావ కిరణ్మయితో కలిపి మొత్తం 28 మంది పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
79 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి.. భారీగా బలగాలను మోహరించారు. మొత్తం 2,350 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు చేస్తున్నారు. 6 కంపెనీల కేంద్ర బలగాలు, 5 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, జోన్ పరిధిలోని జిల్లాల నుంచి అదనపు సిబ్బంది, 10 స్పెషల్ పార్టీలు, డాగ్ స్క్వాడ్స్, టాస్క్‌ఫోర్స్, 27 రూట్ మొబైల్స్, 7 క్విక్ రియాక్షన్ టీమ్స్ బందోబస్తులో ఉన్నాయి. ఈనెల 24న హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితం వెలువడనుంది.
Read More : బ్రేకింగ్ న్యూస్ : సన్ రైజ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం