నాకు చానెళ్లు లేవు.. టీడీపీ, వైసీపీ చేతులు కలిపాయి

  • Published By: vamsi ,Published On : February 22, 2019 / 10:57 AM IST
నాకు చానెళ్లు లేవు.. టీడీపీ, వైసీపీ చేతులు కలిపాయి

Updated On : February 22, 2019 / 10:57 AM IST

వైసీపీ, తెలుగుదేశం పార్టీలు జనసేన పార్టీని దెబ్బ కొట్టేందుకు శాయ శక్తుల కృషి చేస్తున్నాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జనసేన పేరును చెడగొట్టేందుకు టీడీపీ, వైసీపీ చేతులు కలిపాయని ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు తనకు చెప్పినట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా ఉద్దేశపూర్వకంగా జనసేనపై తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై పోరాడేందుకు తనకూ ఓ టీవీ ఛానల్, పత్రిక ఉంటే బాగుండేదని అనిపిస్తోందని, ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఇటువంటి కథనాలు ఇంకా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే తాను ఏ ఛానల్ లేకుండా బీఎస్పీని స్థాపించిన కాన్షీరామ్ స్పూర్తితో ముందుకు వెళ్తానంటూ పేర్కొన్నారు.

    జనసేన పార్టీ తమకు మద్దతు ఇవ్వాలని, స్వతంత్రంగా పోటీ చేయకూడదని ఆయా రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. తాను ఈ రాజకీయ యుద్ధంలో చిన్నపావు మాత్రమే కావొచ్చని కానీ, పోరాడే సైనికుడిని అని ఆయా రాజకీయ పక్షాలు గుర్తుంచుకోవాలని సూచించారు.  ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీతో జనసేన పార్టీ కలిసి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతోందంటూ వస్తున్న కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, టీడీపీ, వైసీపీలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు.‘జనసేన వైసీపీ-బీజేపీలకు భాగస్వామిగా ఉందని ఇంతకుముందు టీడీపీ చెప్పేదని, ఇప్పుడు టీడీపీతో జనసేన కలిసిపోయిందంటూ వైసీపీ చెబుతోందని ఆయన అన్నారు. అంతకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కాగానే, నేను టీఆర్ఎస్-వైసీపీ మనిషినని టీడీపీ ఆరోపించిందని ఆయన అన్నారు. ఈ పార్టీలు అన్నీ తనను స్వతంత్రంగా ఉండనివ్వకుండా చేయడానికి ఇటువంటి కథనాలు ప్రచురించేలా చేస్తున్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు.