టీడీపీలో చేరిన జనసేన నాయకుడు

టిక్కెట్ల అలకలు జనసేన పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారాయి. జనసేనకు మొదటి నుండి పట్టు ఉంది అని చెప్పుకుంటున్న తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం టికెట్ ఆశించి భంగపడిన జనసేన నాయకుడు దూడల శ్రీనివాసరావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఆయనతో పాటు వివిధ మండలాలకు చెందిన వందలాదిమంది జనసేన కార్యకర్తలు టీడీపీ గూటికి చేరుకున్నారు. ద్రాక్షరామంలోని సాయి మాధవానంద కల్యాణ మండపంలో నిర్వహించిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సమక్షంలో జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తోట త్రిమూర్తులు.. నియోజకవర్గ స్థాయిలో నాయకుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ సామాజికవర్గం నుంచి ప్రాతినిధ్యం ఉండేలా కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
దూడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్రబాబు సమర్థుడైన నాయకుడని, ఆయన నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అసవరమని అన్నారు. స్థానిక నియోజకవర్గంపై ఎటువంటి అవగాహన లేని వ్యక్తికి జనసేన టికెట్ ఇవ్వడంతో ఎన్నికల అనంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని బాండు రాసివ్వామని అభ్యర్థిని కోరితే, అందుకు ససేమిరా అనడంతో పార్టీని వీడినట్టు వెల్లడించారు.