వైసీపీ మేనిఫెస్టో బాగుంది.. జగన్ పాలనే బాగలేదు: పవన్ కళ్యాణ్

వైసీపీ ప్రభుత్వం వంద రోజుల పాలనపై నివేదిక ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీపైన, సీఎం జగన్ విధానాల పైన విమర్శలు గుప్పించారు. అయితే వైసీపీ మేనిఫెస్టో మాత్రం చాలా బాగుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనను రెగ్యులర్ పొలిటికల్ పార్టీలా చూడొద్దు.. ఆరోగ్యకరమైన రాజకీయలనే జనసేన చేస్తుంది అని చెప్పిన పవన్ కళ్యాణ్.. వైసీపీ మేనిఫెస్టో జనరంజకంగా ఉంది కానీ జగన్ చేస్తున్న పాలన మాత్రం జనవిరుద్దంగా ఉందని విమర్శించారు.
కొత్త ప్రభుత్వంపై ఇంత త్వరగా మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదని, మూడు నెలల్లోనే ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయని అన్నారు. వంద రోజుల పాలనలో పారదర్శకత.. దార్శినికత.. అనేవి మాటల్లోనే వైసీపీ చూపించిందంటూ 100 రోజుల పాలనపై 33 పేజీల నివేదిక విడుదల చేశారు పవన్ కళ్యాణ్. వాస్తవ పరిస్థితులను గ్రౌండ్ లెవల్ లో తిరిగి గమనించి పార్టీ బృందం నివేదిక సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.
గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇసుక మాఫియా అయితే అదే దారిలో వైసీపీ ప్రభుత్వం నడుస్తుందని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వ ఇసుక పాలసీలో పారదర్శకత లేదని, ధరల విషయంలో కచ్చితత్వం లేదని అన్నారు. రూ.375 అని చెప్పి రూ. 900 వసూలు చేస్తున్నారని అన్నారు. ఇసుక దొరక్కుండా చేసి వందరోజుల్లో సరైన ఇసుక విధానం తీసుకురావడంలో ప్రభుత్వం వైఫల్యం అయ్యిందని అన్నారు. అలాగే వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టో అమలు చెయ్యాలంటే రూ.50 వేల కోట్లు కావాలి. అప్పులకు వడ్డీలు కడుతున్న రాష్ట్రానికి అన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అని పవన్ ప్రశ్నించారు.