ప్రభుత్వం ఏర్పాటుపై జగన్ కు పిలుపు.. శపిస్తే నాశనం అంటూ కేటీఆర్ కు కేఏ పాల్ వార్నింగ్

కవిత, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోయేవారా? అని ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్. నేను శాపం పెడితే నాశనం అయిపోతారని, గొడవలొద్దని కేఏ పాల్ హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్ శాంతిమార్గంలో కలసిరావాలని, తెలంగాణలో 23 కుటుంబాలు ఏడుస్తున్నాయని అందుకు కారణం కేసిఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేఏ పాల్.
ప్రపంచాన్ని జయించిన పాల్‌తో పెట్టుకోవద్దని, డబ్బులు ఎక్కువైతే కాంగ్రెస్, కోదండరాంతో పెట్టుకోవాలని కేటిఆర్‌ను హెచ్చరించారు. తానేం మందా కృష్ణమాదిగను కానని, 2008లో కేసీఆర్ తన దగ్గరకు వస్తే ఆశీర్వదించానని, మెదట తెలంగాణకు మద్దతు ఇచ్చి కేసీఆర్‌కు ఫండింగ్ చేశానని అన్నారు.
అలాగే ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం ఎవరనేది డిసైడ్ చేసేది తానేనని కేఏ పాల్ అన్నారు. కేసీఆర్, జగన్‌లు తనకు శత్రువులు కాదని, చంద్రబాబుకు రిటైర్మెంట్ ఇచ్చి మనిద్దరం ప్రజలకోసం పని చేద్దామని వైఎస్ జగన్‌ను పాల్ కోరారు. కావాలనే తనకు హెలికాప్టర్ గుర్తును కేటాయించారని గుర్తు వల్ల తన ఓట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు వెళ్లాయని అన్నారు. అలాగే ప్రజాశాంతి పార్టీకి 100కు పైగా సీట్లు వస్తాయని చంద్రబాబు సర్వేలోనే తేలిందని, మే 23వ తేదీన ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని అన్నారు.