జనానికి ఊరట : కిలో ఉల్లిపాయలు రూ. 25 మాత్రమే

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటున్న వేళ ఏపీ ప్రభుత్వం జనానికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కిలో ఉల్లిపాయల్ని 25 రూపాయలకే అందుబాటులో ఉంచాలని జగన్ సర్కార్ ఆదేశించింది. మార్కెట్లు, రైతు బజార్లలో ఉల్లిని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. కర్నూలు నుంచి 100 మెట్రిక్ టన్నుల్ని కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 26వ తేదీ గురువారం నుంచి రాయితీ ధరపై ఉల్లి అందుబాటులోకి రానుంది.
అలాగే నాసిక్ నుంచి మరో 300 టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేరుగా మార్క్‌ఫెడ్ నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తోంది. మొత్తంగా 900 మెట్రిక్ టన్నులు అవసరం అవుతుందని అంచనా వేశారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది. విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, విజయవాడ, నెల్లూరు, కడప, చిత్తూరు, కాకినాడ రైతు బజార్లలో సెప్టెంబర్ 27, 28వ తేదీల్లో విక్రయాలను ప్రారంభిస్తారు.
మార్కెట్లో ఉల్లిగడ్డలు కన్నీళ్లు తెప్పిస్తోంది. రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో రూ. 50 పలుకుతోంది. ధరలు పెరగడానికి వర్షాలే కారణమని అంటున్నారు వ్యాపారులు. మహారాష్ట్రతో పాటు ఉల్లిని ఎక్కువగా సాగు చేసే రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఫలితంగా రవాణా అంతరాయం ఏర్పడిందంటున్నారు. వినియోగదారుల నుండి డిమాండ్ అధికం కావడం..ఉల్లిగడ్డలు నిల్వలు సరిపడా లేకపోవడంతో ధరలు పెరిగాయని వెల్లడించారు. దీంతో ఏపీ ప్రభుత్వం ధరలను నియంత్రించేందుకు రంగంలోకి దిగింది. మార్కెటింగ్ శాఖ పరిధిలోని రైతు బజార్లలో విక్రయాలు చేయాలని నిర్ణయించింది.
Read More : కొత్త రూల్ : 6 కంటే ఎక్కువ బీరు సీసాలు ఉంటే చర్యలు