ఉస్మానియాలో కోడెల మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతదేహానికి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయింది. ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌మార్టం నిర్వహించగా, ఈ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డు చేశారు. కోడెల మృతదేహాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించగా, ఆయన చెవుల దగ్గర నుంచి గొంతు మీదగా ఉరి వేసుకున్నట్లు గుర్తులు ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు.
పోస్ట్‌మార్టం అనంతరం భౌతికకాయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించారు. పార్టీకి చెందిన పలువురు టీడీపీ నేతలు ట్రస్ట్ భవన్ చేరుకుని, కోడెలకు నివాళులు అర్పిస్తున్నారు.
సోమవారం రాత్రికి ట్రస్ట్ భవన్ లోనే ఉంచి మంగళవారం సెప్టెంబర్17 ఉదయం ఆరు గంటలకు రోడ్డు మార్గం ద్వారా, నకిరేకల్, చిట్యాల, సూర్యాపేట, కోదాడ, జగ్గయ్యపేట, విజయవాడ మీదుగా మధ్యాహ్నానికి గుంటూరు చేరుకుంటారు. అక్కడ పార్టీ కార్యాలయంలో కొద్దిసేపు ఉంచి నరసరావుపేట తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు.