లోకేష్ ముఖ్యమంత్రి అవడం అసాధ్యం

హైదరాబాద్ : లోకేష్ ను సీఎం చెయ్యాలనే చంద్రబాబు కోరిక ఎప్పటికీ నెరవేరదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అనవసరంగా ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఈవీఎంలు పని చెయ్యలేదని చంద్రబాబు పదేపదే చెప్పడం ఆయన అసహనానికి నిదర్శనం అన్నారు. తనయుడు లోకేష్ ను ముఖ్యమంత్రిని చెయ్యాలన్న చంద్రబాబు ఆశయం నెరవేరే అవకాశం లేకపోవడంతోనే వ్యవస్థలను చంద్రబాబు తప్పుపడుతున్నారని అంబటి మండిపడ్డారు.
చంద్రబాబు రకరకాల రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని అంబటి విమర్శించారు. ఓటమి భయంతోనే వ్యవస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించింది చంద్రబాబే అని చెప్పారు. టీడీపీ, చంద్రబాబు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని అంబటి అన్నారు. టీడీపీని మునిగిపోతున్న నావగా అభివర్ణించారు. మే 23వ తేదీ తర్వాత చంద్రబాబు కన్న కలలన్నీ మాయమైపోతాయని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని పాలించడంతో తనయుడు లోకేష్ ని రాజకీయ వారసుడిగా ప్రకటించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యాలని చంద్రబాబు కలలు కంటున్నారని, ఆయన కోరిక ఎన్నటికీ నెరవేరదని అంబటి చెప్పారు.