తెలుగు కోసం నాలుగు నొక్కితే.. అకౌంట్ లో డబ్బులు మాయం

మోసం చేసేందుకు సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. కాస్త ఆదమరిచి వాళ్లు చెప్పనట్లు చేశారా? మీ బ్యాంకుల్లో ఉన్న డబ్బులు గల్లంతే… అవును ఇది నిజం.. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు రోజుకు ఏదో ఒక నంబర్ తో ఫోన్ చేసి డబ్బులు నొక్కేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో కూడా ఇటువంటి మోసం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పలమనేరులోని గుడియాత్తం రోడ్డులో ఆదెప్ప అనే వ్యక్తి మీ సేవ కేంద్రం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బ్యాంకులో మీకు ఏదైనా సమస్య ఉంటే తెలుసుకోండి అంటూ ఆదెప్ప మొబైల్‌కు 02264427800 అనే నంబరు నుంచి వాయిస్ రికార్డింగ్ కాల్ వచ్చింది. తెలుగులో సమాచారం వినాలంటే నాలుగు నొక్కండి అని చెప్పడంతో ఆదెప్ప అలాగే చేశాడు.
దీంతో కాల్ కట్ అయి నిమిషాల వ్యవధిలో అతని అకౌంట్ నుంచి రూ. వెయ్యి, రూ.200, రూ.6వేలు, రూ. 150 ఇలా డబ్బులు డ్రా అయిపోయినట్లుగా ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి. దీంతో బాధితుడు బ్యాంకుకు పరుగులు తీసి అకౌంట్ ను బ్లాక్ చేయించాడు.
ఇంతలోనే అతని అకౌంట్ నుంచి 40 లావాదేవీలు జరిగగా అకౌంట్ లోని మొత్తం రూ.15వేలు డ్రా అయిపోయాయి. ఇదంతా సైబర్ నేరగాళ్ల పనేనని బ్యాంకు అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీసులకు ఇదే విషయమై ఫిర్యాదు చేశాడు బాధితుడు ఆదెప్ప.
ఇదే తరహాలో అనేక నంబర్ల నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. వాటితో జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.