టీడీపీ జాబితా ఏ కులానికి ఎన్ని సీట్లు 

  • Published By: madhu ,Published On : March 15, 2019 / 01:13 AM IST
టీడీపీ జాబితా ఏ కులానికి ఎన్ని సీట్లు 

టీడీపీ తొలి జాబితాలో ఏ కులానికి ఎన్ని సీట్లు దక్కాయి? ఏ వర్గానికి పెద్దపీట వేశారు? మార్పులు చేర్పుల్లో భాగంగా ఎవరికి స్థానం చలనం కల్పించారు? ఎవరికి టికెట్ లేకుండా చేశారు? టీడీపీ తొలి జాబితాలో అగ్రకులాలకే అధిక ప్రాధాన్యం దక్కిందని చెప్పవచ్చు. తొలి విడతలో భాగంగా 126మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు.. ఇందులో సగానికి పైగా సీట్లను ఓసీలకు కేటాయించారు.
Read Also: నెల్లూరు జిల్లా సిట్టింగ్‌లకు సీట్లు లేనట్లేనా? ఫస్ట్ లిస్ట్‌ ఇదే

ఈ వర్గానికి మొత్తం 72 సీట్లు కేటాయించగా ఇందులో 32 స్థానాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్లిచ్చారు. ఇక మరో అప్పర్ కాస్ట్ అయిన… రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకు 22 సీట్లు కట్టబెట్టారు. మిగతా 18 సీట్లను ఓసీల్లోని ఇతరకులాలకు సర్దుబాటు చేశారు. ఓసీల తర్వాత రెండోస్థానంలో నిలిచింది బీసీలు. బీసీ కులాలకు చెందిన నాయకులకు 31 సీట్లు దక్కాయి. ఇక.. ఎస్సీ, ఎస్టీలకు 21 సీట్లు కేటాయించగా… మైనార్టీలకు రెండు సీట్లను కేటాయించారు.

సిట్టింగ్‌లకు స్థానచలనం : 
ఈ జాబితాలో పలువురు సిట్టింగ్‌లకు స్థానచలనం కల్పించారు చంద్రబాబు. అంతా అనుకున్నట్లుగానే విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు ఈసారి నియోజకవర్గం మారిపోయింది. స్థానికంగా ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఆమెకు టికెట్ కూడా దక్కబోదనే అనుమానాలు నెలకొన్న తరుణంలో.. ఆమె టికెట్ కన్ఫామ్ చేశారు చంద్రబాబు. అయితే.. ఆమెను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అభ్యర్థిగా రంగంలోకి దింపారు. ఆమె స్థానంలో పాయకరావుపేట నుంచి… డాక్టర్ బంగారయ్యను బరిలో నిలిపారు. అయితే.. కొవ్వూరులోనూ తాను విజయఢంకా మోగిస్తానని అనిత ధీమా వ్యక్తం చేశారు. 

ఇక కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జవహర్‌ను కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గానికి మార్చారు. ఇక భీమిలి నుంచి గెలిచి మంత్రి పదవి సంపాదించిన గంటా శ్రీనివాసరావును… ఈసారి విశాఖ ఉత్తరం నుంచి పోటీలో నిలిపారు. ఆయన స్థానంలో భీమిలి నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఇంకా ఖరారుచేయలేదు. ఇక.. బాపట్ల ఎంపీ మాల్యాద్రి శ్రీరాంను అసెంబ్లీ బరిలో దింపారు. ఆయనకు గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గాన్ని కేటాయించారు.

అనంతపురం పార్లమెంట్ పరిధిలోని మూడు స్థానాల సిట్టింగ్‌లును మార్చాల్సిందేనని జేసీ దివాకర్ రెడ్డి పట్టుబడుతుండటంతో… ఆ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నింటినీ పెండింగ్‌లో పెట్టారు. అటు.. ఒంగోలు పార్లమెంట్‌కు పోటీచేసేందుకు మంత్రి శిద్ధా రాఘవరావు విముఖత వ్యక్తంచేస్తుండటంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి స్థానాన్ని పెండింగ్‌లో పెట్టారు. మొత్తంగా.. టికెట్ దక్కిన నేతలు, అనుచరులు సంబరాల్లో మునిగిపోగా…టికెట్  దక్కని నేతలు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడింది టీడీపీ అధిష్టానం.
Read Also: ప్రకాశం టీడీపీ రేసుగుర్రాలు వీళ్లే.. బాలకృష్ణ కారణంగా పూర్తిగా రాని క్లారిటీ!