వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆపరేషన్‌ కాపు : మేల్కొన్న టీడీపీ

  • Published By: madhu ,Published On : February 15, 2019 / 02:12 AM IST
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆపరేషన్‌ కాపు : మేల్కొన్న టీడీపీ

Updated On : February 15, 2019 / 2:12 AM IST

సార్వత్రిక ఎన్నికల వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వలసలు జోరందుకున్నాయి. మొన్న మేడా, నిన్న ఆమంచి.. నేడు అవంతి.. ఇలా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీలోకి క్యూ కడుతున్నారు. వీరి బాటలోనే మరికొందరు చేరనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో టీడీపీ మేల్కొంది. నష్ట నివారణ చర్యలు చేపడుతోంది.

టీడీపీలోని నేతలు తమ పదవులకు రాజీనామా చేసి మరీ చేరుతున్నారు. పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలన్నట్టుగా… జగన్‌ ప్రస్తుతం కాపు సామాజిక వర్గ నేతలను టార్గెట్‌ చేసినట్టు పార్టీలో ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో కాపు సామాజికవర్గ ఓట్లలో సింహభాగం టీడీపీకి పడినందునే అధికారం నుంచి దూరం కావాల్సి వచ్చిందన్న భావనలో జగన్‌ ఉన్నారు. గెలుపోటముల మధ్య వ్యత్యాసం కేవలం ఐదున్నర లక్షల ఓట్లు మాత్రమే. ఈ దఫా కాపు వర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్‌కి అనుకూలంగా మార్చుకుంటేనే అధికారం చేజిక్కించుకోగలమని జగన్‌ భావిస్తున్నారు. అందుకే ఆ వర్గానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారు. వారు కోరిన సీటు ఇచ్చేందుకు సై అంటున్నారు. 

* బుధవారం వైసీపీలోకి ఆమంచి కృష్ణమోహన్‌
* గురువారం వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్‌
* మరికొందరు కాపు నేతలతో చర్చలు

బుధవారం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పార్టీలో చేర్చుకున్న జగన్‌.. గురువారం అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌కు పార్టీ కండువా కప్పారు. వీరిరాకను స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా పార్టీలో చేర్చుకున్నారు. మరికొందరు కాపు నేతలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. యలమంచలి ఎమ్మెల్యే పంచకల రమేష్‌బాబు, రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో పాటు మరికొందరు ప్రజా ప్రతినిధులు ఒకటి రెండు రోజుల్లో టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరుతారన్న సంకేతాలిస్తున్నారు. ఏపీలో కమ్మ సామాజిక వర్గంతో కాపు సామాజిక వర్గానికి అంత సఖ్యత లేదు. ఒకరివల్ల మరొకరం నష్టపోతున్నామనే భావన ఇద్దరిలోనూ ఉంది. అందుకే టీడీపీకి అండగా ఉన్న ఒకవర్గం ఓట్లు ఎలాగూ పడవన్న ఉద్దేశంతో మరొక వర్గాన్ని జగన్ చేరదీస్తున్నారు. చంద్రబాబు సామాజిక వర్గీయులకే ప్రభుత్వంలో పెద్దపీఠ వేస్తున్నారన్న ప్రచారమూ సాగుతోంది. 

* నష్టనివారణ చర్యలు మొదలు పెట్టిన టీడీపీ
* పార్టీని వీడిన నేతల నియోజకవర్గాల్లో సమావేశాలు
* పార్టీ డ్యామేజ్‌ కాకుండా చర్యలు
* పార్టీని వీడే నేతలపై నిఘా

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీనేతలు ఒక్కొక్కరూ జంప్‌ అవుతుండడంపై టీడీపీ  సీరియస్‌గా దృష్టిసారించింది. పైకి ఎవరు వెళ్లినా పార్టీకి నష్టం లేదు అంటూనే.. మరోవైపు నష్ట నివారణ చర్యలు చేపడుతోంది. ఎక్కడెక్కడ అయితే నేతలు పార్టీని వీడుతున్నారో…ఆయా నియోజకవర్గాల్లో వెంటనే కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎక్కువ డ్యామేజ్‌ కాకుండా చర్యలు తీసుకుంటోంది. రానున్న రోజుల్లో ఎవరెవరు పార్టీని వీడే అవకాశముందో గుర్తించి వారిపై నిఘా ఉంచింది. త్వరలోనే  ఒకరిద్దరు నేతలు పార్టీని వీడతారనే సమాచారం టీడీపీ దగ్గర ఉంది. అలాంటి నేతల కదలికలపై అధిష్టానం ఓ కన్నేసి ఉంచింది. ఒకవేళ నేతలు పార్టీ వీడితే వెంటనే నష్ట నివారణ చర్యలు చేపడుతోంది.