జగన్ రెడ్డిని ఏమని పిలవాలో.. జాతీయ మీడియా అలాగే పిలుస్తుంది : పవన్ కళ్యాణ్

  • Published By: vamsi ,Published On : November 14, 2019 / 09:06 AM IST
జగన్ రెడ్డిని ఏమని పిలవాలో.. జాతీయ మీడియా అలాగే పిలుస్తుంది : పవన్ కళ్యాణ్

Updated On : November 14, 2019 / 9:06 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలంటూ వైసీపీ నేతలకు పవన్ చురకలు అంటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులతో సమావేశమైన జగన్.. తాను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అంటే వైసీపీ నేతలు తప్పుబట్టారని మండిపడ్డారు.

జాతీయ మీడియా అంతా ఆయనను అలాగే పిలుస్తుందనే విషయం వైసీపీ నేతలకు తెలియదా ? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జగన్ గారిని జగన్ అనాలో, జగన్ రెడ్డి అనాలో, జగన్ మోహన్ రెడ్డి అనాలో, ఉత్తి జగన్ అనాలో, ఉత్తుత్తి జగన్ అనాలో 150మంది ఎమ్మెల్యేలు కమిటీ వేసుకుని అలాగే తెలియజేయండి. అలానే పిలుస్తాం. బొత్స గారిని కూడా ఏమని పిలవాలో చెప్పండి  అలానే పిలుస్తాం అని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్.

అంతేకాని తాను జగన్ రెడ్డి అంటే పవన్ నాయుడు అంటూ తనకు కులం ఆపాదించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించొద్దంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ కులంలో.. ఏ మతంలో పుట్టాలి అని మన ఎవరికీ ఛాయిస్ లేదు. కానీ ఎలా ప్రవర్తించాలో మాత్రం మన చేతిలోనే ఉంటుంది అని, నా పేరులో లేనిది నాకు ఆపాదించకండి. ఏమన్నా ఉంటే నేనే చెప్తా అని అన్నారు.