కార్మికుల కోసం : ‘డొక్కా సీతమ్మ’ క్యాంటీన్లు ప్రారంభించిన పవన్ కళ్యాణ్

ఆకలితో ఉన్నవారికి అన్నపూర్ణగా పేరొందిన ‘డొక్కా సీతమ్మ’ పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాంటిన్లను ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటానని ప్రకటించిన పవన్ శనివారం (నవంబర్ 15) మంగళగిరిలో ‘డొక్కా సీతమ్మ’ క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ప్లేట్లల్లో ఆహారాన్ని వడ్డించి కార్మికులకు అందించారు. పేదలకు అండగా ఉండే ఇటువంటి కార్యక్రమాలకు అందరూ అండగా నిలబడాలని పవన్ పిలుపునిచ్చారు.
ఏపీలో నెలకొన్న ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. వారికి అండగా జనసేన పలు కార్యక్రమాలను చేపట్టింది. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని దుయ్యబట్టారు. ఇసుక కొరత నివారించకుండా ఇసుక వారోత్సవాల్ని ఎలా జరుపుతారంటూ పవన్ ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ కూడా వారికి అండగా నిలబడతానని పవన్ హామీ ఇచ్చారు. కాగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ‘డొక్కా సీతమ్మ’ పేరుతో క్యాంటీన్లను ఏర్పాటు చేసిన పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తానని పవన్ కళ్యాణ్ ఎన్నికలల్లో తెలిపిన విషయం తెలిసిందే.
అన్నపూర్ణ ‘డొక్కా సీతమ్మ’
ఆకలితో ఉన్నవారికి రాత్రి పగలు అనే తేడా లేకుండా స్వయంగా తన చేతులతో అన్నం వండి పెట్టిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. అన్నపూర్ణగా ఆమె పేరు ఖండాంతర ఖ్యాతి గడించారు డొక్కా సీతమ్మ. ఉభయ గోదావరి జిల్లాలల్లో అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. అతివృష్టి, అనావృష్టిలతో కష్టాల్లో ఉన్నవారికి..పలు ఇబ్బందులకు గురయ్యే పేదలను ఆదుకొంటూ..లేదనకుండా నిత్యాన్నదానము జరిపిన అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ.
’అన్నమో రామచంద్రా’ అన్నవారి ఆకలి తీర్చిన అమ్మ డొక్కా సీతమ్మ. భారతీయ సాంప్రదాయంలో ‘అన్నం పరబ్రహ్మ స్వరూపమ్ ‘ అని పేర్కొనడం మనం వింటున్నాం. అన్నదానానికి మించిన దానంలేదని నమ్మిన అమ్మ. ఆకలితో ఉన్నవారికి కడపు నిండా అన్నం పెట్టిన స్త్రీ మూర్తి..అమ్మ అనే పదానికి అసలై నిర్వచనం చెప్పిన మహా మానవతా మూర్తి డొక్కా సీతమ్మ. డొక్కా సీతమ్మ ఇంట్లో రోజుకు 24 గంటలూ పొయ్యి వెలుగుతునే ఉండేది. వెలిగించిన పొయ్యి ఆరకుండా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టిన అన్నపూర్ణ ‘డొక్కా సీతమ్మ’. ఆమె పేరుతో క్యాంటీన్లను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఇసుక కొరత కష్టాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల కోసం క్యాంటీన్లను ప్రారంభించి ఆహారాన్ని అందిస్తున్నారు.