ప్రకాశంలో ఎన్నికలు : ఓట్ల ఉత్సవానికి సిద్ధం

ప్రకాశం జిల్లాలో రేపు జరిగే పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్దఎత్తున బలగాలను మోహరించారు. ఈసారి నువ్వా నేనా అనేలా ఎన్నికలు జరగబోతున్నాయి. టీడీపీ, వైసీపీల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. దీంతో జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 11వ తేదీన జిల్లావ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్ విధించారు. జిల్లాలోని 26 లక్షల 32వేల 407 మంది ఓటర్లు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
జిల్లాల్లో 13 లక్షల 8వేల 179 మంది పురుషులు ఉండగా… 13 లక్షల 24 వేల 75 మంది స్త్రీలు… 153 మంది థర్డ్ జండర్స్ ఉన్నారు. వీరిలో చిన్నపిల్లల తల్లులు, బాలింతలు, వృద్ధులు, గర్భిణులు క్యూలో నిలబడకుండా ఓటును త్వరగా వినియోగించుకునేలా ప్రాధాన్యత కల్పించారు. ప్రతి ఇద్దరి స్త్రీలకు ఒక పురుషుడి చొప్పన ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. వృద్ధుల కోసం ఆటోలు, వికలాంగులకు వీల్‌ఛైర్స్, స్పెషల్ వాలంటీర్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఓటర్లు తప్ప ఇతరులు తిరగకుండా ఆంక్షలు విధించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు తలెత్తినా ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి… హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 10 వేల 893 ఈవీఎంలు… 8 వేల 288 బ్యాలెట్ యూనిట్లు… 7 వేల 971 కంట్రోల్ యూనిట్లు… 8 వేల 590 వీవీ ప్యాట్స్‌ను వినియోగించనున్నారు. వీటితో పాటు జిల్లాలో 26 లక్షల 32 వేల 407 మందికి ఫోటో ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశారు. ఓటు వినియోగించుకునే అభ్యర్థులు.. ఓటర్ స్లిప్పుతో పాటు మరో 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల పరిధిలో 3 వేల 269 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం 27వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపర్చడానికి ఒంగోలు రైజ్, ఫేస్ ఇంజినీరింగ్ కాలేజీల్లో మూడంచెల భద్రత మద్య స్ట్రాంగ్‌రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 23 కంపెనీల భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నారు. జిల్లాలో 505 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా… అదనపు బలగాలను మోహరించారు.