ఏపీలో ఎన్నికలకు సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లతో పాటు ఇతర సామాగ్రిని సిద్ధంగా ఉంచారు. ఈవీఎంలు మొరాయించినా పోలింగ్ ఆగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 25 ఎంపీ, 175 ఎమ్యెల్యేల ఎంపికకు 46,394 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ప్రత్యేకంగా ఈవీఎంలను ఏర్పాటు చేశారు. 15 మంది అభ్యర్థులు ఉంటే ఒక ఈవీఎం, 15 మంది మించిన చోట రెండు ఈవీఎంలు, 31 మంది దాటితే మూడు ఈవీవిఎంలు ఏర్పాటు చేశారు. ఒక్కో ఈవిఎంలో 1,400 మంది ఓటర్లు ఓటు వేస్తారు. 46,394 పోలింగ్ స్టేషన్‌లలో ఎలాంటి అంతరాయం జరిగినా.. ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈవీఎంలకుగాను.. కంట్రోల్ యూనిట్‌లు, బ్యాలెట్ యూనిట్‌లు 20 శాతం, వీవీప్యాట్‌లు 30శాతం అదనంగా జిల్లా కేంద్రంలో, రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉంచుతారు. అంతరాయం కలిగిన పోలింగ్ బూత్‌కి గంట వ్యవధిలోనే వీటిని తరలిస్తారు. ఆయా జిల్లాల అవసరాన్ని బట్టి .. అదనంగా వీటిని కేటాయిస్తారు. వీటిని జిల్లా కేంద్రాలకు ఇప్పటికే తరలించారు. బెంగుళూరు, హైదరబాద్ నుంచి వీటిని తెప్పించి .. నేరుగా జిల్లా కేంద్రాలకు తరలించారు.
రాష్ట్రంలో 9 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఎన్నికల నిర్వహణలో 4,20,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. వీరిలో 3లక్షల మంది ఎన్నికల సిబ్బంది, 1,20,000 మంది పోలీసులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 7,300 ఆర్టీసీ బస్సులు, 300 ప్రైవేటు బస్సులు, 24 సీట్లు ఉన్న రెండు హెలికాఫ్టర్లు వినియోగిస్తారు. అటవీప్రాంతాలు ఉన్న విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామాగ్రి తరలింపునకు.. హెలికాఫ్టర్లను ఉపయోగించనున్నారు. విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఎన్నికలు ముగుస్తాయి. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో .. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎన్నికలు ముగుస్తాయి. ఇవి మావోయిస్టు ప్రభావిత ప్రాతాలైనందున ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. మిగిలిన చోట్ల యధావిధిగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగనుంది.
ఈ ఎన్నికల్లో 1,94,62,339 మంది పురుషులు, 1,98,79,421 మంది స్త్రీలు, 3,957 మంది ట్రాన్స్ జెండర్లు, మొత్తం 3,93,45,717 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 42,04,436 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 18,18,113 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు ఎటువంటి సమస్యలు ఎదుర్కొనకుండా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దివ్యాంగులు ఓటు వేసేందుకు వీల్ ఛైర్లు, తగిన సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. బదిరుల కోసం బ్రెయిలీ లిపిలో రూపొందించిన బ్యాలెట్ పేపర్ అందుబాటులో ఉంచారు. వాటిని పరిశీలించిన అనంతరం వారు ఓటేస్తారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండటంతో .. ఏపి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్దం అయ్యింది.