10tv ఎఫెక్ట్ : రవిప్రకాష్ సంజీవని ఆస్పత్రిలో అక్రమాలపై విచారణ

  • Published By: madhu ,Published On : October 10, 2019 / 05:39 AM IST
10tv ఎఫెక్ట్ : రవిప్రకాష్ సంజీవని ఆస్పత్రిలో అక్రమాలపై విచారణ

Updated On : October 10, 2019 / 5:39 AM IST

కూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి అక్రమాల డొంక కదులుతోంది. ధర్మాసుపత్రి పేరుతో రవిప్రకాశ్‌ అండ్‌ కో చేసిన అక్రమాలను 10TV బయటపెట్టడంతో ప్రభుత్వం కదిలింది. అటు ఆర్డీవో ఇటు ఇంటెలిజెన్స్‌ రెండూ రంగంలోకి దిగాయి. రవిప్రకాశ్‌ సిలికానాంధ్ర ఆసుపత్రి వ్యవహారం కలకలం రేపడంతో ప్రభుత్వం స్పందించింది.  అసలేం జరిగిందో తేల్చాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్‌ ఆదేశాలతో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి పూర్తిస్థాయి అక్రమాలను బయటపెట్టేందుకు గుడివాడ ఆర్డీవో రంగంలోకి దిగారు. కూచిపూడి వాసులతో పాటు పలువురు దాతలు, ఎన్నారైల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి… వాటిని దారి మళ్లించిన తీరును వెలుగులోకి తెచ్చింది 10tv.

సంజీవని ఆసుపత్రి విరాళాల గుట్టు బయటపడనుంది. ధర్మాసుపత్రి అయినప్పటికీ పేదల నుంచి వైద్యానికి డబ్బులు వసూలు చేయడంపై కూడా ఆర్డీవో దృష్టిపెట్టనున్నారు. ఆస్పత్రి ప్రారంభమై ఏడాది దాటిపోయినా ఇన్‌పేషెంట్‌ విభాగం ఎందుకు అందుబాటులోకి రాలేదు. అంబులెన్సులు ఎందుకు కొనలేదు..? అన్నది కూడా విచారించనున్నారు. రవిప్రకాశ్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి విరాళాలు, మోసాలను బయటపెట్టాలని, తామిచ్చిన విరాళాలు ఏమయ్యాయో తేల్చాలని కూచిపూడి వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

కూచిపూడిలోని సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి ఆరోపణలపై ఆర్డీఓ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించామన్నారు కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌. నిధుల దుర్వినియోగం, స్థలం ఎవరిది, ఆస్పత్రికి అనుమతులకు సంబంధించి పూర్తి రిపోర్టు ఇవ్వాలని ఆర్డీఓను ఆదేశించామన్నారు. కూచిపూడి ప్రాంతంలో నిర్మించిన సిలికానాంధ్ర్ సంజీవని హాస్పిటల్‌ దాతల విరాళంతో కట్టారని తమకు సమాచారం ఉందన్నారు. నేడు కూచిపూడిలో విచారణ జరపనున్నారు. ధర్మాసుపత్రి పేరుతో విరాళాలు సేకరించడం, దాతలు ఇచ్చిన సొమ్ముతో భూముల్ని కొని వాటిని సొంతానికి వాడుకోవడంపై విచారణ జరపనున్నారు. 

ఇటు రవిప్రకాశ్‌ సిలికానాంధ్ర ఆసుపత్రి వ్యవహారంపై ఇంటెలిజెన్స్‌ కూడా దృష్టిపెట్టింది. ఎంత మొత్తంలో నిధులు సేకరించారు, ఎవరెవరు విరాళాలు ఇచ్చారు…? వాటిని ఏం చేశారు అన్న అంశాలపై ఇంటెలిజెన్స్ సమాచారం సేకరిస్తోంది. కూచిపూడి పరిసర ప్రాంతాల్లోని 150 గ్రామాల్లో ప్రజల నుంచి సమాచారాన్ని నిఘావర్గాలు సేకరించనున్నాయి. అంతేకాదు పేదలకు వైద్యం పేరిట నిర్మించిన ఆసుపత్రిలో అసలు వారికి వైద్యం అందకపోవడంపైనా దృష్టి పెట్టింది. ఆసుపత్రిలో వైద్యం అందక మరణించిన వారి వివరాలనూ సేకరిస్తోంది. నిధుల  దుర్వినియోగం, విరాళాల సేకరణపై నివేదికను సిద్ధం చేస్తోంది. 
Read More : తెలుగు రాష్ట్రాల్లో రెండు బస్సు ప్రమాదాలు