ఏపీలో రీ పోలింగ్..పోలింగ్ బూత్‌లు ఇవే

  • Published By: madhu ,Published On : May 2, 2019 / 01:01 AM IST
ఏపీలో రీ పోలింగ్..పోలింగ్ బూత్‌లు ఇవే

Updated On : May 2, 2019 / 1:01 AM IST

ఏపీలో 5 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్టు CEC వెల్లడించింది. మే 6వ తేదీన రీపోలింగ్‌ జరపనున్నట్టు తెలిపింది. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసి చొప్పున.. ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌ జరగనుంది. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధి కేసనపల్లిలోని 94వ పోలింగ్ కేంద్రం‌, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ఉన్న 244వ పోలింగ్‌ కేంద్రం, నెల్లూరు  జిల్లాలోని సూళ్లురుపేట నియోజకవర్గంలోని అటకానితిప్పలోని 197వ కేంద్రం, నెల్లూరు అసెంబ్లీ పరిధిలోని పల్లెపాలెంలోని ఇసుకపల్లిలో గల 41వ పోలింగ్‌ కేంద్రం, ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం కలనూతలలో ఉన్న 247వ పోలింగ్‌ కేంద్రాలలో రీపోలింగ్‌ నిర్వహించాలని సీఈసీ నిర్ణయించింది.

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మొత్తం ఐదు చోట్ల రీపోలింగ్‌ జరిపే బూత్‌లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల పోలింగ్‌లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు తలెత్తడంతో పాటు.. మరికొన్నిచోట్ల ఈవీఎంలలో ఇబ్బందులు తలెత్తాయి. ఈవీఎంలు మొరాయించడంతో.. పోలింగ్ ఆలశ్యమైంది. దీంతో… నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్‌ కోరుతూ స్థానిక కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ప్రతిపాదనలు పంపించారు. వీటిని పరిశీలించిన ద్వివేదీ ఈ 5 చోట్ల రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏపీ ఎన్నికల సంఘం ఈ చోట్ల రీపోలింగ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. 

మరోవైపు… గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువు పోలింగ్ బూత్‌లో వైసీపీ అభ్యర్థి యేసు రత్నం కుమారుడు సాయంత్రం అక్రమాలకు పాల్పడ్డాడని టీడీపీ ఆరోపించింది. ఈ విషయంపై టీడీపీ అభ్యర్థి గిరిధర్… ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు.. ఇచ్చిన నివేదిక ఆధారంగా అక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయిచింది. రీపోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈసీ ఆదేశించింది. దీంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చర్యలు ప్రారంభించారు.