రాక్ ఫిల్ నిర్మాణం : రికార్డులోకి ఎక్కనున్న నార్లాపూర్ రిజర్వాయర్

రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నార్లాపూర్ రిజర్వాయర్ వేదికగా మారనుంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాజెక్టులో నిర్మించని రాక్‌ఫిల్ డ్యామ్ మొట్ట మొదటిసారిగా ఏర్పాటు కానుంది. ఈ కొత్త విధానానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలోనే ఈ రాక్‌ఫిల్ పద్దతిలో ఇప్పటివరకు నిర్మించినవాటిల్లో ఉత్తరాఖండ్‌లోని తెహ్రీడ్యామ్ మొదటికాగా.. రెండోదిగా నార్లాపూర్ రికార్డుకు ఎక్కనుంది.
కరువు, కాటకాలతో సతమతమయ్యే పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా పాలమూరు ప్రాంతంతో పాటు నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని బీడు భూములకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు, దాదాపు వెయ్యి గ్రామాలకు తాగునీరు అందనుంది. అందుకే ఈ ప్రాజెక్టుకు మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 5 రిజర్వాయర్ల పనులను చేపట్టారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల పనులు చకచక సాగుతున్నాయి. మొదటి రిజర్వాయరైన నార్లాపూర్‌లో 75 మీటర్ల ఎత్తులో కట్ట నిర్మాణం చేయాల్సి ఉంది. ఇంత పెద్ద ఎత్తులో కట్ట నిర్మాణం కోసం 2 కోట్ల 26 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అవసరమవుతుంది. కానీ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కేవలం 60 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర ప్రాంతాల నుంచి మట్టి తీసుకురావాలంటే ఖర్చు తడిసిమోపెడవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాక్‌ఫిల్ పద్ధతిలో కట్ట నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.
ఈ రాక్‌ఫిల్ పద్ధతిలో ఇప్పటివరకు ఉత్తరాఖండ్‌లోని తెహ్రీడ్యామ్‌ను మాత్రమే నిర్మించారు. రిక్టర్‌స్కేల్‌పై 9 లేదా 10 పాయింట్ల స్థాయిలో భూకంపాలు వచ్చినా రాక్‌ఫిల్ పద్దతిలో నిర్మించిన డ్యామ్ తట్టుకుని నిలబడగలదు. ఈ పద్ధతిలో నిర్మాణం చేపట్టడం కాస్త సాహసంతో కూడుకున్న పని. దీంతో రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు ఉత్తరాఖండ్‌కు వెళ్లి తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని పరిశీలించారు. అలాగే సాంకేతిక సహకారం అందించాల్సిందిగా తెహ్రీ హైడ్రో పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను సహాయం కోరగా.. వారుకూడా ముందుకొచ్చారు. ఈ మేరకు సదరు కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ వైష్ణోయ్ రాష్ట్రానికి వచ్చి నార్లాపూర్ రిజర్వాయర్‌ను పరిశీలించి వెళ్లారు. దీంతో రాక్‌ఫిల్ నిర్మాణం కోసం అధికారులు 11 వందల 82 కోట్ల రూపాయలతో అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులకు పచ్చజెండా ఊపితే పనులు ప్రారంభం కానున్నాయి.