ఫలించిన కల : జనగామలో శాతవాహన ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్

శాతవాహన ఎక్స్‌ప్రెస్ విజయవాడ, సికింద్రాబాద్ ల మధ్య నడిచే సూపర్ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ రోజు (ఫిబ్రవరి 21, 2019)న జనగామ రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్ ఇవ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం విజయవాడ నుంచి బయలుదేరే శాతవాహన రైలు ఉదయం 10:15 గంటలకు జనగామకు చేరుకొని సికింద్రాబాద్ వైపుకు బయలుదేరుతుంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి జనగామకు సాయంత్రం 5:15 గంటలకు చేరుకొని విజయవాడ వైపు బయలుదేరుతుంది.
జనగామ స్టేషన్‌లో కేవలం ఒక్క నిమిషం మాత్రమే రైలు హాల్టింగ్ ఇవ్వడంతో పాటు అప్ అండ్ డౌన్‌లో వచ్చే ఆదాయాన్ని ఆరునెలల పాటు ప్రయోగాత్మకంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. జనగామలో శాతవాహన, శిరిడీ, ఛార్మినార్, దానాపూర్ వంటి పలు ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని, కోచ్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు ఎంతోకాలంగా కోరుతున్నారు.
దీనిపై స్పందించిన ఎంపీ త్వరలో శాతవాహన హాల్టింగ్ ఉంటుందని ప్రకటించారు. కాగా, జనగామ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు కృషి చేసిన భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ రోజు 10గంటలకు జనగామ స్టేషన్‌లో శాతవాహన హాల్టింగ్‌కు పచ్చజెండా ఊపి స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు.