మాటల్లేవ్.. బ్యాట్స్‌మెన్ గెలవాలనుకోలేదు: ఢిల్లీ కెప్టెన్

మాటల్లేవ్.. బ్యాట్స్‌మెన్ గెలవాలనుకోలేదు: ఢిల్లీ కెప్టెన్

Updated On : April 2, 2019 / 12:50 PM IST

ఐపీఎల్ 12లో ఢిల్లీ క్యాపిటల్స్ తీరు చూస్తుంటే.. కెరటంలా కనిపిస్తోంది. పడిపడి లేస్తూ పోరాడుతోంది. ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు గెలుపోటములను వరుసగా ఎదుర్కొంటోంది. ఏప్రిల్ 1 పంజాబ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆఖరి 3 ఓవర్లలో 8వికెట్లు చేజార్చుకుని ఘోరమైన పరాజయాన్ని ఎదుర్కొంది. 

అంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సూపర్ ఓవర్లో విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో శ్రేయాస్ అయ్యర్.. తర్వాతి మ్యాచ్ నుంచి ఒక ఓవర్ ముందుగానే మ్యాచ్ ముగిస్తామంటూ చెప్పుకొచ్చాడు. కానీ, వెంటనే జరిగిన మ్యాచ్‌లోనే ఢిల్లీ వరుస వికెట్లు చేజార్చుకుని నవ్వుల పాలైంది.

ఈ ప్రదర్శన పట్ల కెప్టెన్ శ్రేయాస్ స్పందిస్తూ.. ‘మాటల్లేవ్.. చెప్పడానికి ఏం లేదు. ఇలాంటి మ్యాచ్‌లు ఎందుకు పనికిరావు. చాలా అసంతృప్తికి గురయ్యా. సులువుగా సాధించాల్సిన టార్గెట్‌ను వదిలేసుకున్నాం. పంజాబ్ అన్ని విభాగాల్లో రాణించి విజయాన్ని దక్కించుకుంది. మా బ్యాట్స్‌మెన్ గెలవాలనుకోలేదు. గెలిచేందుకు ఏం చేయాలోననే స్పృహ లేకుండా ప్రవర్తించారు’ అని శ్రేయాస్ అయ్యర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. 

ఈ మ్యాచ్‌లో 167 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ 14 పరుగుల తేడాతో ఓటమికి గురైంది. సులువుగా చేధించాల్సిన టార్గెట్‌ను నిర్లక్ష్యంతో వదులుకుంది.