దేవుడు దిగిరావాలి : చంద్రబాబు సీఎం అవకుండా ఆపలేరు

  • Published By: veegamteam ,Published On : April 20, 2019 / 12:28 PM IST
దేవుడు దిగిరావాలి : చంద్రబాబు సీఎం అవకుండా ఆపలేరు

Updated On : April 20, 2019 / 12:28 PM IST

హైదరాబాద్ : ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మరోసారి సీఎం అవకుండా ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా మోడీ, జగన్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. అలా చేయాలంటే దేవుడు దిగిరావాలని సోమిరెడ్డి చెప్పారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని సోమిరెడ్డి విమర్శించారు.

చంద్రబాబు సమీక్షలను ఈసీ తప్పుపట్టడంపై సోమిరెడ్డి మండిపడ్డారు. మోడీ, కేసీఆర్ కి ఓ న్యాయం.. చంద్రబాబుకి మరో న్యాయమా అని ఈసీని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు సమీక్షలపై అనవసరంగా రాద్దాంతం చేశారని సీరియస్ అయ్యారు. ఎన్నికల తర్వాత సమీక్షలు చేయొచ్చని ఈసీనే చెబుతోందని ఆయన గుర్తు చేశారు. మోడీ, కేసీఆర్, రాజ్ నాథ్ సింగ్ కు ఈసీ నిబంధనలు వర్తించవా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారిని దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సోమిరెడ్డి ఆరోపించారు.
Also Read : ఎన్నికల కోడ్ ఒక్క APలోనే ఉందా? – లోకేష్ ట్వీట్

ఎన్నికల సమయంలో ఏపీలో ప్రతిపక్షం నేతలు వేల కోట్ల రూపాయలు పంచారని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రలో 13మంది ప్రధానులను చూశామని, మోడీ లాంటి పీఎంని చూడలేదని సోమిరెడ్డి అన్నారు. మోడీ ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని మండిపడ్డారు. ఎమర్జెన్సీ రోజులను తలపించారని అన్నారు. చంద్రబాబు పేరు వింటే మోడీకి రాత్రిళ్లు కూడా నిద్రపట్టడం లేదన్నారు. అందుకే చంద్రబాబు సీఎం కాకూడదని కుట్రలు చేస్తున్నారని చెప్పారు. మోడీ, జగన్, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబు సీఎం కాకుండా ఆపలేరని సోమిరెడ్డి అన్నారు.

నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టీడీపీ 25వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని ఆనాడు చెప్పానని, తాను చెప్పినట్టే టీడీపీ 27వేల ఓట్లతో గెలిచిందన్నారు. ఈ ఎన్నికల్లో కూడా టీడీపీనే గెలుస్తుందని సోమిరెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీకి 100కి పైగా సీట్లు ఖాయమన్నారు. చంద్రబాబు పరిపాలనను ప్రజలు మెచ్చారని.. రైతులు, ఆడపడుచులు, వికలాంగులు, వృద్ధులు టీడీపీకే ఓటు వేశారని సోమిరెడ్డి చెప్పారు. రాష్ట్రం విడిపోయాక ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు పాలన ఇచ్చారని అన్నారు. ఈసీని అడ్డుపెట్టుకుని మోడీ ఏదో చెయ్యాలని చూశారని, ఈసీ సిగ్గుతో తలదించుకోవాలని సోమిరెడ్డి అన్నారు. ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఈసీ దారుణంగా విఫలమైందని సోమిరెడ్డి విమర్శించారు. ఈసీ ఏపీ ప్రజలను హింసించిందన్నారు. అర్థరాత్రి వరకు ఆడవాళ్లు క్యూలో నిల్చునే పరిస్థితి కల్పించిందన్నారు. ఈవీఎంల తీరు మీద విరక్తి పుట్టేలా, ఈవీఎంల కంటే బ్యాలెట్ పేపర్ మేలు అనిపించేలా ఈసీ చేసిందని సోమిరెడ్డి అన్నారు.
Also Read : పీజీ చేయకుండా రాహుల్ ఎంఫిల్ ఎలా చేస్తారు : జీవీఎల్ క్వశ్చన్స్