జగన్ కేసులకు సొంత డబ్బు పెట్టుకోవాలి: సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి

సీబీఐ కోర్టులో జగన్ వ్యక్తిగత హాజరుకు సంబంధించి కోర్టు పిటీషన్‌ను కొట్టివేసిన క్రమంలో ఇదే విషయమై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే బాధ్యత వహిస్తూ ఇంతకుముందు నీలం సంజీవరెడ్డి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు సోమిరెడ్డి. నీలం సంజీవరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రైవేటు బస్సులు జాతీయం చేయగా.. కోర్టు దానిని తప్పు పట్టింది. దీంతో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి రాజీనామా చేశారు.
అయితే ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో రాజీనామా చేస్తారో? లేదో? జగన్ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు ప్రతినిధి అయిన వ్యక్తి పేరును కోర్టులో పిలిస్తుంటే, ప్రతివారం బోనులో నిలబడటమంటే ఏమనాలి అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల కేసుల్లో ఏడాది లోపు తీర్పు ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా కూడా జగన్ విషయంలో మాత్రం తీర్పు సక్రమంగా అమలు కావట్లేదని అన్నారు.
జగన్ విషయంలో కూడా సుప్రీం తీర్పు పక్కాగా అమలు కావాలని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు సోమిరెడ్డి. తప్పులు చేసిన వారు ఎంతటివారైనా మినహాయింపులు ఉండకూడదని అన్నారు సోమిరెడ్డి. జగన్ అన్ని కేసుల విషయాల్లోనూ కోర్టులు విచారణ పూర్తి చేసి త్వరగా తేల్చేయాలని కోరుతున్నట్లు చెప్పారు సోమిరెడ్డి.
ఇక హైదరాబాద్ వెళ్లుందుకు ప్రత్యేక విమానం పెట్టుకున్నా కూడా జగన్‌కు కేవలం రూ.10 లక్షల్లోపే ఖర్చు అవుతుందని, కానీ రూ.60 లక్షల ఖర్చు అవుతున్నట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారని, కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన దానికి జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కేసులో ఎంత ఖర్చయినా జగనే స్వయంగా పెట్టుకోవాలని, జగన్ సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన కేసు ఇది కాదని జగన్ వ్యక్తిగతమైన కేసుకి ప్రజల డబ్బు ఎందుకు వాడాలని అన్నారు సోమిరెడ్డి.