రాయలసీమకు మీరేం చేశారు: జనసేన, బీజేపీ పొత్తులపై చంద్రబాబు

  • Published By: vamsi ,Published On : January 23, 2020 / 08:27 AM IST
రాయలసీమకు మీరేం చేశారు: జనసేన, బీజేపీ పొత్తులపై చంద్రబాబు

Updated On : January 23, 2020 / 8:27 AM IST

భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. బీజేపీ, జనసేన పొత్తుపై నేషనల్ మీడియా ఏఎన్‌ఐ‌తో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏ రాజకీయ పార్టీ అయినా వేరే పార్టీతో కలిసి నడవచ్చునని అన్నారు. అది వారి అంతర్గత నిర్ణయం అని అన్నారు. ప్రస్తుతం జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని.. అది వారి ఇష్టం అని అన్నారు. ఇదే సమయంలో ‘భవిష్యత్‌లో బీజేపీ, టీడీపీ మరోసారి కలిసి పనిచేసే అవకాశముందా’? అనే ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. రాజకీయాల్లో ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వలేనని అన్నారు.

అలాగే రాయలసీమకు హైకోర్టు రాకుండా చంద్రబాబు అన్యాయం చేశారని వైసీపీ ఆరోపిస్తోందని.. ఆ ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారని మీడియా ప్రతినిధి అడగ్గా.. తాను రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తినేనని… అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తినని గుర్తుచేసిన చంద్రబాబు.. రాయలసీమ గురించి మాట్లాడటానికి మీరెవరు? రాయలసీమకు మీరేం చేశారని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు చంద్రబాబు.

రాయలసీమకు నీళ్లు ఎవరిచ్చారు.. కంపెనీలు ఎవరు తెచ్చారు అంటూ నిలదీశారు. తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభిస్తే తాను పూర్తిచేసినట్లు వెల్లడించారు. అనంతపురానికి కియా మోటార్స్‌ను తాను తీసుకొచ్చానని చంద్రబాబు గుర్తుచేశారు. శ్రీసిటీకి టీడీపీ హయాంలో పలు పరిశ్రమలు వచ్చాయని, వైఎస్ఆర్ గానీ, జగన్ గానీ రాయలసీమకు ఏం చేశారో చెప్పాలంటూ సవాల్ విసిరారు చంద్రబాబు.