వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్: వైసీపీలోకి టీడీపీ నేత

  • Published By: vamsi ,Published On : October 6, 2019 / 12:09 PM IST
వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్: వైసీపీలోకి టీడీపీ నేత

Updated On : October 6, 2019 / 12:09 PM IST

తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేతలు ఆ పార్టీని వీడి ఇప్పటివరకు బీజేపీలోకి వెళ్లగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైసీపీలోకి వెళ్లేందుకు టీడీపీ నేతలు సిద్ధం అవుతున్నారు. లేటెస్ట్ గా టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీలో చేరుతున్నట్లు తెలిసినప్పటికీ అందులో క్లారిటీ లేదు. అయితే లేటెస్ట్ గా సన్యాసిపాత్రుడును వైసీపీలో చేర్చుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వెల్లడించారు.

ఆదివారమే(06 అక్టోబర్ 2019) ఆయన పార్టీలో చేరుతారు అని తొలుత భావించినా జగన్ ఢిల్లీ పర్యటన ఉండడంతో కుదరలేదు. ఈ క్రమంలోనే సన్యాసిపాత్రుడు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. పార్టీ అధిష్టానం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వగా.. త్వరలో ఆయనను పార్టీలో చేర్చుకుంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

అయ్యన్నపాత్రుడి పుట్టిన రోజు నాడే సన్యాసి పాత్రుడు పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఆయనతోపాటు పలువురు కౌన్సిలర్లు టీడీపీకి రాజీనామా చేశారు. అయ్యన్న పాత్రుడు, సన్యాసి పాత్రుడి మధ్య చాలాకాలం నుంచి వైరం ఉంది. అయ్యన్నను హతమార్చడానికి ఆయన సోదరుడు కుట్ర పన్నారనే వార్తలు కూడా అప్పట్లో వ్యాపించాయి. అయితే తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేశారని సన్యాసి పాత్రుడు అప్పట్లో వివరణ ఇచ్చుకున్నారు. సన్యాసి పాత్రుడు నర్సీపట్నంలో మంచి పట్టు ఉన్న నేత.