గిట్టుబాటు ధర కోసం : పత్తికొండ హైవేపై టమాట రైతుల ఆందోళన..

పత్తికొండ రైతులు కన్నెర్ర చేశారు. హైవేను దిగ్భందం చేశారు. భారీగా వచ్చిన రైతులు రోడ్డుపై బైఠాయించారు. జాతీయ రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మంత్రాలయం – బెంగళూరు హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కమీషన్లు లేకుండా టమాటలను కొనుగోలు చేయాలని అంటున్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతంలో విస్తారంగా టమాట సాగు అవుతుంటుంది. కొన్ని వేల క్వింటాల పంట పండిస్తుంటారు. అయితే..మార్కెట్‌కు తీసుకొచ్చే పంటకు సరియైన న్యాయం జరగడం లేదంటున్నారు రైతులు. వ్యాపారులు సిండికేట్ అయ్యి..తక్కువ ధరలో కొనుగోలు చేస్తున్నారని, తాము ఎన్నిసార్లు ఆందోళన చేసినా..అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టమాట జత గంప రూ. 400 నుంచి రూ. 600 వరకు కొన్నారు. కానీ అక్టోబర్ 17వ తేదీ గురువారం మాత్రం రూ. 100 నుంచి రూ. 200 వరకు కొంటున్నారు వ్యాపారులు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు వెల్లడించారు. అయినా..వ్యాపారులు వినిపించుకోలేదు. ఏమి చేసేది లేక..రైతులు ఆందోళనబాట పట్టారు. ఇప్పటికైనా గిట్టుబాటు ధర కల్పించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని టమాట రైతులు కోరుతున్నారు.
Read More : ఏం జరుగుతోంది : కూచిపూడికి కూచిబొట్ల..దాతలతో సమావేశం