డబ్బులు ఇవ్వలేదని : చిన్నారిని బండకేసి కొట్టి చంపిన మేనమామ

క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. తాగిన మత్తులో, ఇతరత్రా కారణాలతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వరుసగా హత్యలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. మాట వినకపోతే..హత్యలకు తెగబడుతున్నారు. తాజాగా నల్గొండా జిల్లా పెద్దపూర మంలం పెద్దగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది.
చిన్నగూడెంలో మూడు నెలల చిన్నారిని బండకేసి కొట్టాడు మేనమామ. దీంతో చిన్నారి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడనే మృతి చెందింది. స్థానికులు, కుటుంబసభ్యులు పట్టుకుని అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
గ్రామానికి చెందిన ఉపేందర్ అనే వ్యక్తి..అక్క, బావలతో గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వలేదనే కోపంతో అక్కడనే ఉన్న ముక్కుపచ్చలారని శిశువును చేతుల్లోకి తీసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. చిన్నారిని చంపేసిన అనంతరం పారిపోతున్న ఉపేందర్‌ను స్థానికులు పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. చిన్నారి..విగతజీవురాలిగా అవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.