పార్టీ మారుతారా : సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ

టీడీపీకి మరో షాక్ తగులబోతుందా ? అంటే ఎస్ అనిపిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత వల్లభనేని వంశీ పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. 2019, అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. శుక్రవారం గుంటూరు జిల్లాకు వచ్చారు సుజనా. ఈ సందర్భంగా ఆయన్ను వంశీ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. వెంటనే టీడీపీ అధిష్టానం అలర్ట్ అయ్యింది. వంశీని బుజ్జగించేందుకు నేతలు రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.
ఇటీవలే వల్లభనేని వంశీపై నకిలీ పట్టాల ఆరోపణలు వచ్చాయి. ఆయన్ను అరెస్టు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. రాజకీయంగా ఇబ్బందులు, కేసుల పరిస్థితులపై బాబుకు సవివరంగా వివరించినట్లు సమాచారం. ఆయన్ను ఎప్పుడైనా అరెస్టు చేస్తారన్న సమాచారంతో బయటకు పొక్కడం..సుజనాతో వంశీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ అనంతరం ఒకే కారులో సుజనా, వంశీ బయలుదేరినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇసుక కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. కానీ ఈ కార్యక్రమంలో వంశీ పాల్గొన లేదు. మరి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా ? లేదా ? అనేది చూడాలి.
Read More :