వైజాగ్‌లో భారత నావికాదళ దినోత్సవం 2019

ఏటా డిసెంబర్ 4వ తేదీని ఇండియన్ నేవీ ఫోర్స్ డేగా భారత నావికాదళంగా జరుపుకుంటుంది. ఎయిర్ ఫోర్స్ డేకు గగనతలంలో విన్యాసాలు చేస్తూ ఎలా అయితే జరుపుకుంటారో నేవీ డే రోజున అదే స్థాయిలో సంబరాలు చేసుకుంటారు. ఈ మేరకు విశాఖలోని నేవీ విభాగం ముస్తాబైంది.
దీని కోసం ఆర్కే బీచ్ ప్రత్యేకంగా సిద్ధం చేశారు. అదే సమయంలో గగనతలంలోని విమానాలకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. బీచ్ కు ఆహార పదార్థాలను తీసుకురావొద్దని ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు.
75 సంవత్సరాల్లో భారత నౌకాదళం ప్రపంచంలోనే అతిపెద్ద దళాల్లో సమర్థమైన నౌకాదళ శక్తిగా మారగా.. దేశంలోనే ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం ఆవిర్భవించింది. అంతేకాదు.. ఈ నౌకాదళ దినోత్సవం నిర్వహించుకోడానికీ కేంద్ర బిందువు కూడా విశాఖపట్నమే కావడం మరో విశేషం.
తీర ప్రాంత రక్షణకు వెన్నెముకగా ఉన్న ఈఎన్‌సీ (ఈస్ట్ నేవల్ కమాండ్).. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో ఇండియన్ నేవీ.. ఎప్పటికప్పుడు నౌకా సంపత్తిని పెంచుకుంటూ శత్రుదుర్భేద్యంగా మారుతోంది. తూర్పు నౌకాదళం పరిధిలో 40 వరకూ యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లున్నాయి.