వీడియో వైరల్: జనసేన అభ్యర్ధిపై వైసీపీ దౌర్జన్యం

  • Published By: vamsi ,Published On : March 27, 2019 / 01:37 AM IST
వీడియో వైరల్: జనసేన అభ్యర్ధిపై వైసీపీ దౌర్జన్యం

Updated On : March 27, 2019 / 1:37 AM IST

ఏపీ రాజకీయాల్లో ప్రచార వేడి పెరిగిపోయింది. ఈ క్రమంలో భీమిలిలో ప్రచారం చేస్తున్న జనసేన అభ్యర్థి డాక్టర్ సందీప్ పంచకర్లపై వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అనుచరులు బాహాబాహీకి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా, అది విపరీతంగా వైరల్ అవుతోంది. వైసీపీ అభ్యర్థి తన ప్రచారంలో అవంతి శ్రీనివాస్‌పై విమర్శలు చేస్తుండడంతో జీర్ణించుకోలేని అవంతి అనుచరులు జనసేన ప్రచార రథంపైకి ఎక్కి ఆ పార్టీ అభ్యర్ధిపై దౌర్జన్యానికి దిగారు.

ప్రచారంలో భాగంగా డాక్టర్ సందీప్ పంచకర్ల మాట్లాడుతుండగా అక్కడకు వచ్చిన అవంతి అనుచరులు వచ్చి స్థాయి లేకుండా అవంతిపై విమర్శలు చేస్తావా? అంటూ తిట్టడం మొదలెట్టారు. ప్రచారంలో విమర్శిస్తామని, కావాలంటే ప్రతి విమర్శలు చేసుకోవాలి కానీ అందరూ చూస్తుండగా దాడులకు దిగడం సరికాదని జనసేన అభ్యర్థి సందీప్ చెబుతున్నా వినిపించుకోని అవంతి అనుచరుడు మీదిమీదికి వెళ్లాడు.

దీంతో పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన కొందరు నేతలు సర్దిచెప్పగా ఘర్షణ వాతావరణం తగ్గింది. అనంతరం మాట్లాడిన సందీప్..  మనకు ఈ రౌడీలు అవసరమా అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియోని జనసేన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు. వైసీపీ రౌడీయిజం అని పేర్కొని #SaveAPFromJAGAN అనే ట్యాగ్‌ను దానికి జతచేశారు.