వడగండ్ల వాన : రైతులను అదుకుంటాం – హరీష్

వడగళ్ల వానకు నష్టపోయిన అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకుంటాం..అండగా ఉంటాం..అధైర్య పడకండి అంటూ సిద్ధిపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రైతులకు భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలకు తీరని నష్టం వాటిల్లుతోంది. నీటికి ధాన్యం తడిసిపోయింది. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి పంటలు పండిస్తే..మొత్తం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిన్నకోడూరు మండలంలో ఏప్రిల్ 20వ తేదీ శనివారం కురిసిన వడగళ్ల వర్షానికి నష్టపోయిన వరి, మామిడి, మిర్చి పంటలను హరీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ..ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలు, వడగండ్ల వాన పడటంతో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులకు తీవ్రనష్టం జరగడం బాధాకరమన్నారు. నష్టపోయిన పంటలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందచేయాలని వ్యవసాయం, ఉద్యానవన, రెవెన్యూ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. నివేదిక రాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా సహాయం అందిస్తామని హరీష్ హామీనిచ్చారు.