ఆ వివాదాన్ని అక్కడికక్కడే పరిష్కరించిన వైఎస్ వివేకా

మాజీమంత్రి, వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 68 ఏళ్లు. పులివెందులలోని స్వగృహంలో శుక్రవారం (మార్చి 15) తెల్లవారుజామున వివేకానందరెడ్డి తుదిశ్వాస విడిచారు. వివేకా మృతితో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. జగన్ షాక్ కు గురయ్యారు. వివేకానందరెడ్డికి భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వివేకానందరెడ్డి సౌమ్యుడిగా పేరు పొందారు. తనకు సాయం చేయమని అడిగిన వారి కోసం ఎంతవరకైనా వెళ్లేవారు. రాజకీయాల్లో వైఎస్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తూ అజాత శత్రువుగా ఉన్నారు.
1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు. వైఎస్ కు.. వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పనిచేశారు. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. 1989, 1994లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004లో కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో వ్యయసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సౌమ్యునిగా పేరున్న వివేకానందరెడ్డి మరణం కుటుంబంలోనే కాదు వైసీపీ శ్రేణులు, వైఎస్ అభిమానుల్లోనూ విషాదం నింపింది.
Read Also: బాత్రూంలో ఏం జరిగింది : వివేకానందరెడ్డి మృతిలో 5 అనుమానాలు
ఎన్నికల వేళ వైసీపీ వ్యవహారాల్లో వివేకా కీలకంగా వ్యవహరిస్తున్నారు. జగన్ కు తోడుగా ఉండి కార్యకలాపాలు చూసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, కార్యకర్తలను మొబలైజ్ చేసే వరకు అన్ని రకాలుగా జగన్ కు సహకారంగా ఉంటున్నారు. మంగళవారం (మార్చి 12) జగన్ నివాసం లోటస్ పాండ్ దగ్గర వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా ఉరవకొండ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డికి ఇవ్వద్దంటూ.. మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి మద్దతుదారులు నినాదాలు చేశారు. అదే సమయానికి అటుగా వచ్చిన వైఎస్ వివేకానందరెడ్డి కారును అడ్డగించారు. ఆయన వారిని సముదాయించారు. వారికి సర్ది చెప్పారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని బలపరచాలని, ఆయన ఎంపిక చేసిన వారికి మద్దుతివ్వాలని విజ్ఞప్తి చేశారు. మనమంతా కలిసి వైసీపీ అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలని సూచించారు. టికెట్ కోసం ఆందోళనకు దిగిన వారికి సర్ది చెప్పి వారందరని పంపించేశారు. ఆ వివాదాన్ని అక్కడికక్కడ పరిష్కరించారు.
శనివారం నుంచి ఇడుపులపాయలో ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉంది. అభ్యర్థుల ఎంపిక కూడా అయ్యింది. ఇక ప్రకటించడమే ఉంది. ఇలాంటి కీలక సమయంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకోవడం వైసీపీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Read Also: వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు