మార్గదర్శకాలు ఇవే : యువత కోసం వైఎస్ఆర్ ఆదర్శ పథకం

  • Published By: veegamteam ,Published On : October 22, 2019 / 10:26 AM IST
మార్గదర్శకాలు ఇవే : యువత కోసం వైఎస్ఆర్ ఆదర్శ పథకం

Updated On : October 22, 2019 / 10:26 AM IST

వైఎస్సార్ ఆదర్శ పథకం మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. వివిధ కార్పొరేషన్ల ద్వారా 6 వేల వాహనాల కొనుగోలుకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా వాహనాలను అందజేయనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి నేతృత్వంలో 8 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో కమిటీ నియమించారు. అర్హుల ఎంపిక, రుణాల మంజూరుపై కమిటీలు పర్యవేక్షించనున్నాయి. 

ఇసుక రవాణా, పౌరసరఫరాలు సహా ప్రభుత్వం వినియోగించే ప్రతి రవాణాలో స్వయం ఉపాధికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వివిధ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ట్రక్కుల కొనుగోలుకు అవకాశం కల్పించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ యువతకు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ ఆదర్శం కింద పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. 

ట్రక్కు కొనుగోలుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని, లబ్ధిదారుడు రూ. 50 వేలు కడితే ట్రక్కు వచ్చేలా పథకాన్ని రూపొందించాలని సీఎం జగన్ సూచించారు. ఎక్కడా అవినీతి లేకుండా..పారదర్శకంగా ఉండేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆమోదించారు. కనీసం నెలకు రూ. 20 వేలు ఆదాయం వచ్చేలా చూడాలని, జిల్లాల వారీగా లక్ష్యాలు రూపొందించాలని ఆదేశించారు. ఐదేళ్ల తర్వాత యువతకు వాహనం సొంతం అయ్యే విధంగా చూడాలని, విధి విధానాలను రూపొందించాలని సీఎం జగన్ సూచించారు.