స్వల్ప మెజార్టీతో డొనాల్డ్ ట్రంప్ గెలవచ్చు: ప్రసిద్ధ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమ్మెర్
ట్రంప్, హారిస్‌లో ఎవరు గెలిచినా భారత్‌లో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తారని ఆయన తెలిపారు.

Donald Trump Kamala Harris
US election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎవరికి అధికంగా ఉన్నాయన్న విషయంపై విశ్లేషకులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రట్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య గట్టి పోటీ ఉండనుందనే చెబుతున్నారు.
తాజాగా, యురేషియా గ్రూప్ అధ్యక్షుడు, ప్రసిద్ధ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమ్మెర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌లో ఎవరు గెలిచినా ఆశ్చర్యమేమీ లేదని అన్నారు. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ స్వల్ప మెజార్టీతో గెలుస్తారని తాము అనుకుంటున్నట్లు తెలిపారు.
దీన్ని కూడా చాలా తక్కువ నమ్మకంతో చెబుతున్నామని అన్నారు. గత ఎన్నికల్లో ఏయే రాష్ట్రాల్లో రిపబ్లికన్లు అత్యధికంగా గెలిచారో ఆయా రాష్ట్రాల్లోనూ ట్రంప్ ఇప్పుడు బలహీనంగా కనపడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, ఇటీవల నిర్వహించిన సర్వేల ద్వారా ఇది తేలిందని చెప్పారు.
ఓటు ఎవరికి వేయాలో ఇప్పటివరకు నిర్ణయించుకోని వారు ఇప్పుడు ఎవరి వైపునకు మొగ్గు చూపుతారు? చివరకు ఓట్లను సమర్థంగా రాబట్టే విషయంలో ఏ పార్టీ విజయవంతం అవుతుంది? అన్న అంశాలే ఫలితాలను నిర్ణయిస్తాయని అన్నారు.
ఎలక్ట్రోరల్ కాలేజ్‌లో గెలిచినవారు పాపులర్ ఓట్లలో మెజార్టీ సాధించే అవకాశం అంతగా లేదని తెలిపారు. 2016 అధ్యక్ష్య ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌పై డొనాల్డ్ ట్రంప్ 28 లక్షల ఓట్లతో వెనకబడి ఉన్నప్పటికీ ఎలక్ట్రోరల్ కాలేజ్‌లో ఆమెను ఆయన ఓడించారని గుర్తుచేశారు.
ఇప్పుడు ట్రంప్ ఎలక్ట్రోరల్ కాలేజ్‌లో గెలిస్తే.. పాపులర్ ఓట్‌లో గెలిచే అవకాశాలు 50 శాతమే ఉంటాయని అన్నారు. భారత నాయకత్వంలో ట్రంప్‌కి వ్యక్తిగతంగా ఇప్పటికే సత్సంబంధాలు ఉన్నప్పటికీ.. ట్రంప్, హారిస్‌లో ఎవరు గెలిచినా భారత్‌లో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తారని ఆయన తెలిపారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ ద్వారక తిరుమలరావు.. ఏమన్నారంటే?