AP Weather: బీకేర్ ఫుల్.. ఇటు వడగాలులు, అటు పిడుగుల వర్షాలు.. ఏపీలో రేపు భిన్న వాతావరణం..
AP Heatwave Alert: శుక్రవారం రాష్ట్రంలో 43-44 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
AP Weather: ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు దంచికొడుతున్నాయి. మరోవైపు పిడుగుల వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం భిన్నమైన వాతావరణం ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని, మరికొన్ని చోట్ల వానలు పడతాయని చెప్పింది.
రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గురువారం నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 17 జిల్లాల పరిధిలోని 126 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక,
శుక్రవారం రాష్ట్రంలో 43-44 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
మరోవైపు బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, పిడుగులు పడేటప్పుడు పంట పొలాల్లో పని చేసే రైతులు, పశుకాపరులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద నిలబడవద్దన్నారు. వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు:
* నంద్యాల జిల్లా సంజామల – 43.3°C
* కర్నూలు జిల్లా కౌతాళం – 42.9°C
* అనంతపురం జిల్లా తెరన్నపల్లి – 42.8°C
* చిత్తూరు జిల్లా రాయలపేట – 42.2°C
* వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు – 42.2°C
తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అవసరం లేకుండా ఎండలో బయటకు వెళ్లవద్దని సూచించారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తలకు క్యాప్ పెట్టుకోవడం, గొడుగు వాడటం వంటి జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎండ నేరుగా తగలకుండా చూసుకోవాలన్నారు. అలాగే వడదెబ్బ బారిన పడకుండా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని అధికారులు సూచించారు. గుండె, బీపీ, షుగర్ సమస్యలు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.
Also Read: ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
