AP Weather: ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది. ముఖ్యంగా రైతులు, పశుకాపరులు అప్రమత్తంగా ఉండాలంది.
AP Weather: ఉత్తర శ్రీలంక తీర ప్రాంతం-నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వచ్చే 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందన్నారు. అల్పపీడనం ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉంటుందన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు.
మంగళవారం పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంది.
వర్షాల నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది. ముఖ్యంగా రైతులు, పశుకాపరులు అప్రమత్తంగా ఉండాలంది. పంట పొలాలు, బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద, పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ కింద ఆశ్రయం తీసుకోవద్దంది. మేఘావృతం, ఉరుములు మొదలైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జాగ్రత్తలు చెప్పింది.
ఈ మండలాలకు వడగాలుల హెచ్చరిక..
మరోవైపు రాష్ట్రంలోని కొన్ని మండలాలకు వడగాలుల హెచ్చరిక చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. అల్లూరి జిల్లా జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, మారేడుమిల్లి, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
విజయవాడ తూర్పు – 42.3°C
కుక్కునూరు, కూనవరం – 42.1°C
మంత్రాలయం – 41.5°C
కొప్పెరపాడు – 41.4°C
కడప – 41.3°C
రాష్ట్రవ్యాప్తంగా ఒకవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాల పరిస్థితి నెలకొనడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Also Read: రేషన్ కార్డుదారులకి అలర్ట్.. ఈ పని చేయకపోతే.. పథకాలు ఆగిపోతాయి, రేషన్ రాదు.. వెంటనే ఇలా చేయండి
