Heatwave: బీ కేర్ఫుల్.. ఇటు మంట పుట్టించే ఎండలు, అటు పిడుగుల వర్షాలు.. ఏపీలో రేపు భిన్న వాతావరణం
32 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు హీట్ అలర్ట్ జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ.
Heatwave: అసలే సమ్మర్. ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతతో ఏపీలో జనం విలవిలలాడిపోతున్నారు. ఇది చాలదన్నట్లు పిడుగులతో కూడిన వానలు బెంబేలెత్తిస్తున్నాయి. ఏపీలో రేపు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి. ఓవైపు ఎండలు దంచికొట్టనుండగా, మరోవైపు పిడుగులతో కూడిన వానలు కురవనున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
కర్నూలు నగరడోనలో అత్యధిక ఉష్ణోగ్రత (45.4°C) నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 279 మండలాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. రేపు పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమలో తీవ్ర ఎండలు ఉండనున్నాయి. 32 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు హీట్ అలర్ట్ జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. మరో 17 మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయి. పలు జిల్లాల్లో 44°C పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
ఖాజీపేటలో 44.5°C, కరపలో 44.4°C, రాయదుర్గంలో 44.3°C, వరదయ్యపాలెం 43.8°C, అనుమలపల్లి 43.6°C ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. గుండె, షుగర్, బీపీ ఉన్నవారు బయటకు రావద్దని చెప్పింది. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తాగాలని సూచనలు చేసింది.
అటు ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయంది. ఉరుముల సమయంలో చెట్ల కింద నిల్చోవద్దని హెచ్చరించింది. రైతులు, పశుకాపరులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
Also Read: తమిళనాడులో భారీ పేలుడు.. 18మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
